గంటా మీద గుస్సా...అయినా... ?

Update: 2022-02-19 12:30 GMT
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద గుస్సా అవుతోందని టాక్. పార్టీ కీలకమైన  మీటింగునకు పిలిస్తే ఈ మాజీ మంత్రి తనకు బిజీ అని చెప్పి డుమ్మా కొట్టడాన్ని హై కమాండ్ సీరియస్ గానే తీసుకుంటోంది అని అంటున్నారు. పార్టీ కంటే కూడా ముఖ్యమైన పనులు వేరేగా ఉంటాయా అని కూడా భావిస్తున్నారుట. గంటా విషయంలో గత మూడేళ్లుగా అధినాయకత్వం తర్జన భర్జన‌లోనే ఉంది.

ఆయన గెలిచిన తరువాత నుంచి కూడా పార్టీకి  ఏనాడూ అందుబాటులో లేరనే చెబుతారు.  అప్పట్లో చంద్రబాబు విశాఖ వచ్చినా కూడా గంటా గైర్ హాజరు అయిన సంఘటనలనూ ఉదహరిస్తున్నారు. ఇదిలా ఉండగా గంటా ఒక దశలో వైసీపీలో చేరడానికి చేసిన ప్రయత్నం చిట్ట చివరి క్షణంలో ఆగిపోయింది. ఆ సమాచారం కూడా పక్కాగా టీడీపీ పెద్దల వద్ద ఉందిట.

ఇవన్నీ ఇలా ఉంచితే ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం ఇష్యూలో కూడా పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయడం కూడా పార్టీ పెద్దలకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే విశాఖను రాజధానిగా స్వాగతిస్తూ గంటా అప్పట్లో ప్రకటన చేయడం కూడా మంట పుట్టించింది అని చెప్పుకుంటారు.

ఇక చంద్రబాబు మీద అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నేతలు చేసినా గంటా పెద్దగా రియాక్ట్ అవలేదని అంటారు. అలాగే చంద్రబాబు మంగళగిరిలో ఆందోళన చేసినా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరిగినా కూడా గంటా తనదైన స్ట్రాటజీతోనే ముందుకు వెళ్లారే తప్ప అండగా నిలబడిన దాఖలాలు లేవు అనే అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇపుడు గంటా కాపుల ఐక్యత పేరు మీద వరస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన సొంత రాజెకీయం కోసమే అంటున్నారు. ఇలా అధినాయకత్వంలో గ్యాప్ ని మెయిన్ టెయిన్ చేస్తున్న గంటాను మీటింగునకు పిలిచినా రాకపోవడంతో పార్టీ పెద్దలలో అసహనం కట్టలు తెంచుకుంటోందిట.

గంటా విషయంలో యాక్షన్ తీసుకోవాలని కూడా మరో వైపు వత్తిడి వస్తోంది అని కూడా అంటున్నారు. అయితే గంటా ఆషా మాషీ నాయకుడు కాదు, ఆయన ఏపీలో బలమైన నేతగా ఉన్నారు. పైగా ఆయనకు దన్నుగా కులం కార్డు ఉంది. ఏపీలో ఇపుడు సామాజిక పరిస్థితులు కూడా ఆయనకు కలసి వస్తున్నాయి. దాంతో గంటా మీద గుస్సా అవుతున్నా యాక్షన్ తీసుకునేటంత కఠిన నిర్ణయానికి పార్టీ వస్తుందా అన్నది సందేహమే అని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలో బలమైన నేతగా ఉన్న గంటాను వదులుకునే స్థితిలో మాత్రం పార్టీ లేదు అని మరో వాదన ఉంది. అయితే గంటా కీలకమైన మీటింగునకు డుమ్మా కొట్టడం మీద ఉదాశీనంగా ఉంటే మిగిలిన నేతలు కూడా పార్టీ ఆదేశాలను లైట్ తీసుకుంటారేమో అన్న ఆందోళన అయితే అధినాయకత్వంలో ఉందని అంటున్నారు.

ఇక తాజా పరిణామాలను వైసీపీ కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. గంటా టీడీపీ భేటీకి వెళ్లకపోవడాన్ని తమను అనుకూలంగా మార్చుకునేందుకు ఆ పార్టీ కూడా చూస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే గంటా ఇపుడు సేఫ్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. తానున్న పార్టీ తన మీద ఏ విధమైన  యాక్షన్ తీసుకోలేదు, అలాగే మిగిలిన పార్టీలు కూడా గంటా వస్తే వెల్ కమ్ చెప్పేందుకు రెడీ అనేలా ఉన్నాయి. సో ఏపీలో ఇంతటి డిమాండ్ ఉన్న నేత మరొకరు ఉన్నారా అంటూ పొలిటికల్ గా సెటైర్లు అయితే పడుతున్నాయి. ఏది ఏమైనా గంటా రాజకీయ చతురతకు జోహార్ అనే అంటున్నారు.
Tags:    

Similar News