దేశంలోనే తొలిసారి.. హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎంలు

Update: 2022-03-18 04:23 GMT
ఏటీఎం అన్నంతనే.. ఎనీ టైం మనీ అనే చెప్పాలి. కానీ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. బంగారాన్ని ఏటీఎంలో ఉంచేసి.. కొనుగోలుదారులకు వీలుగా ఏర్పాటు చేసే సరికొత్త విధానానికి ఒక సంస్థ శ్రీకారం చుడుతుంటే.. దానికి వేదికగా మారింది హైదరాబాద్ మహానగరం. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఇప్పటివరకు షోరూంలు.. బంగారు షాపుల్లోనే కుదురుతుంది. అందుకు భిన్నంగా రోడ్డు పక్కన ఉండే ఏటీఎంలలో కూడా వీటిని కొనుగోలు చేసేలా సరికొత్త గోల్డ్ ఏటీఎంలను సిద్ధం చేస్తున్నారు.

దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ఏటీఎంలను హైదరాబాద్ మహానగరంలో షురూ చేయనున్నారు. రానున్న నెలన్నర కాలంలో ప్రయోగాత్మకంగా భాగ్యనగరిలో ఏర్పాటు చేసి.. అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. గోల్డ్ సిక్కా సంస్థ.. ఈ బంగారు ఏటీఎంల కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చింది. ఇంతకూ ఈ గోల్డ్ ఏటీఎంలు ఎలా పని చేస్తాయన్నది చూస్తే.. ఒక్కో ఏటీఎం మిషన్లో 5 కేజీల బంగారాన్ని ఉంచుతారు.

ఇందులో అర గ్రాము నుంచి పది గ్రాముల వరకు.. తర్వాతి కాలంలో వంద గ్రాముల బార్ ను కూడా అందుబాటులో ఉంచుతారు. షోరూంలు.. మిగిలిన గోల్డ్ షాపులతో పోలిస్తే తక్కువ ధరకు బంగారాన్ని ప్రజలకు అందే ఏర్పాటు ఉంది. ఈ ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన వారు తమ డెబిట్.. క్రెడిట్ కార్డుల సాయంతో ఈ గోల్డ్ ఏటీఎంలను ఉపయోగించుకునే వీలుంది. అయితే.. దీనికి సంబంధించి బ్యాంకులతో గోల్డ్ సిక్కా సంస్థ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది.

హైదరాబాద్ విషయానికి వస్తే తొలిసారి మొత్తం మూడు గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తారు. అందులో ఒకటి బంగారు వ్యాపారులు ఎక్కువగా ఉండే ఓల్డ్ సిటీ.. అబిడ్స్ తో పాటు మరో కేంద్రంలోనూ ఈ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని సదరు కంపెనీ చెబుతోంది. హాల్ మార్కింగ్ తో పాటు.. ఇతర గుర్తింపు ధ్రువీకరణలు ఉన్న బంగారు కాయిన్లను ఈ ఏటీఎంలలో ఉంచుతారు. మరీ.. ప్రయోగం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News