గుజరాత్ కేంద్రంగా మరో వివాదం ?

Update: 2022-03-18 04:28 GMT
కర్ణాటకలో పుట్టి దేశమంతా పాకిన  హిజబ్ వివాదం ఇంకా ముగియనే లేదు. అలాంటిది గుజరాత్ కేంద్రంగా మరో వివాదం మొదలవ్వబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలోని అన్నీ స్కూళ్ళల్లో బోధనాంశంగా భగవద్గీతను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 6-12 తరగతుల మధ్య భగవద్గీతను బోధనాంశంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే అని విద్యాశాఖ మంత్రి జీతు వాఘాని ప్రకటించారు.

భగవద్గీతలోని విలువలను విద్యార్ధులందరికీ పరిచయం చేయటంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాఘాని తెలిపారు. బడుల్లో భగవద్గీతను బోధించటంతో పాటు అందులోని శ్లోకాలను అప్పచెప్పటం, శ్లోకాల వివరాలను తెలియజేయడం లాంటివి ఉంటాయన్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి చెప్పారు. ఆడియో, వీడియో పద్దతులతో పాటు ప్రింట్ రూపంలో కూడా భగవద్గీతను విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించే వర్గాలు ఎప్పుడూ కాచుక్కూర్చునుంటాయి. కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇలాగే దేశంలో చిచ్చు పెట్టింది. విద్యాసంస్థల్లో యూనిఫాం మాత్రమే ధరించాలని యాజమాన్యాలు చెప్పినందుకే ముస్లిం విద్యార్ధినులు ఎంత రచ్చ చేశారు ? దాని ప్రభావం దేశంలో ఎలా పడిందో అందరు చూసిందే.

ఇంకా ఆ వివాదం ముగియలేదు.  హిజాబ్ ధరించటానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముస్లింలు మండిపోతున్నారు. సుప్రింకోర్టులో అప్పీలు చేయబోతున్నారు. కర్ణాటక బంద్ పిలుపిచ్చారు. హిజాబ్ వేడి చల్లారక ముందే  అన్నీ స్కూళ్ళల్లో  భగవద్గీత బోధనంటే ముస్లింలు ఊరుకుంటారా ? శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని ప్రభుత్వాలు యోగాను స్కూళ్ళల్లో ప్రవేశపెడితేనే ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటిది ఇపుడు గుజరాత్ ప్రభుత్వం ఏకంగా భగవద్గీతను చదవాల్సిందే అంటే ముస్లింలు ఎలా రియాక్టవుతారో చూడాల్సిందే.  దేశవ్యాప్తంగా మరో  వివాదాన్ని ఎదుర్కోవటానికి అన్నీ ప్రభుత్వాలు రెడీగా ఉండాల్సిందే.
Tags:    

Similar News