అన్న త‌గ్గిన‌ట్టున్నాడే.. మ‌రి తమ్ముడు?

Update: 2022-03-23 15:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఎప్పుడు ఎలా ఉంటున్నారో ఊహించ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. సీనియ‌ర్ నేత‌ల వైఖ‌రి ఆశ్య‌ర్యాన్ని కలిగిస్తోంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పేరు విన‌గానే ఒంటికాలిపై లేచే జ‌గ్గారెడ్డి.. ఇటీవ‌ల గాంధీభ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా రేవంత్‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఝ‌ల‌క్ ఇస్తా.. ఆయ‌న అంతు చూస్తా అంటున్నారు. ఇక టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌కు బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన్ప‌టి నుంచి ఆయ‌న్ని అన్ని ర‌కాలుగా వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తాజాగా త‌న‌తో క‌లిసి విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. రేవంత్‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో అధిష్ఠానంపై అసంతృప్తితో పార్టీ మారేలా క‌నిపించిన ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

బీజేపీలోకి వెళ్తార‌ని..

మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి టీపీసీసీ ప‌ద‌వి ఆశించారు. సీనియ‌ర్ నాయ‌కుడినైన త‌న‌కు అధిష్ఠానం ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెబుతుంద‌ని క‌ల క‌న్నారు. కానీ హైక‌మాండ్ మాత్రం టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన రేవంత్ను అధ్య‌క్షునిగా నియ‌మించింది. ఇది త‌ట్టుకోలేని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అధిష్ఠానంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కోట్ల రూపాయాలు ముట్ట‌జెప్పి రేవంత్ ఆ ప‌ద‌వి కొనుక్కున్నార‌ని వెంక‌ట్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అప్ప‌టి నుంచి రేవంత్‌ను వ్య‌తిరేకిస్తూనే వ‌స్తున్నారు. పార్టీలో ఉన్న నాయ‌కులు పట్టించుకోని అధిష్ఠానంపై అసంతృప్తితో ఆయ‌న బీజేపీలో చేర‌తార‌నే ప్రచారం జోరుగా సాగింది. ఇటీవ‌ల ఢిల్లీలో ప్ర‌ధాని మోడీకి క‌ల‌వ‌డంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుంది.

చ‌చ్చేవ‌ర‌కూ కాంగ్రెస్‌లోనే..

మ‌రోవైపు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తమ్ముడు, మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి కూడా పార్టీ మారే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌లో గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని అలాంటి చోట తాను ఉండ‌లేన‌ని ఇటీవ‌ల రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై పోరాటం చేసే పార్టీలోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు. దీంతో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకోబోతున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. అన్న‌ద‌మ్ములు క‌లిసి బీజేపీలో చేర‌తార‌నే టాక్ వినిపించింది. కానీ వెంక‌ట్‌రెడ్డి మాత్రం ఇప్పుడు త‌గ్గిన‌ట్లే క‌నిపిస్తున్నారు.

చ‌చ్చేవ‌ర‌కూ కాంగ్రెస్‌లోనే ఉంటాన‌ని పార్టీ మారే ఉద్దేశమే లేద‌ని స్ప‌ష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, నైనీ బొగ్గు అవినీతిని తెలియ‌జేసేందుకే ప్ర‌ధానిని క‌లిశాన‌ని ఆయ‌న చెప్పారు. అంతే కానీ పార్టీ మారేందుకు కాద‌ని వెల్ల‌డించారు. అన్ని పార్టీల్లోనూ విభేదాలుంటాయ‌ని వాళ్లు కడుపులో క‌త్తులు పెట్టుకుని కౌగిలించుకుంటార‌ని త‌మ పార్టీలో పైకి విమ‌ర్శ‌లు చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. మ‌రి ఇప్పుడు రాజ‌గోపాల్‌రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అన్న బాట‌లోనే సాగి ఆయ‌న కూడా కాంగ్రెస్‌లోనే కొన‌సాగేందుకు సై అంటారా అన్న‌ది చూడాలి. లేదా అధిష్ఠానంపై అసంతృప్తితో బీజేపీకి జై కొడ‌తారా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News