నాగబాబు బిగ్ సౌండ్...ఢీ అంటే ఢీ...?

Update: 2022-02-28 12:30 GMT
మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ  పొలిటికల్  సీన్ లోకి వచ్చారు.  కొన్నాళ్ళుగా ఆయన రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా జగన్ పాలన తీరుని కూడా అపుడపుడు మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్న నేపధ్యమూ ఉంది. ఆ మధ్య మీడియా ఇంటర్వ్యూలో సైతం తనకు రాజకీయాలు అంటే పవర్ తో పాటు  పదవులు తీసుకోవడం కానే కాదని చెప్పేశారు. తాను మళ్లీ పోటీ చేసే ఉద్దేశ్యం కూడా ఎక్కడా లేదని కూడా  తేల్చేశారు.

అయితే సడెన్ గా నాగబాబు మళ్ళీ రాజకీయ తెర మీద మెరుస్తున్నారు. ఈ మధ్యన నర్సాపురంలో జరిగిన మత్య్సకార సభలో ఆయన వేదిక మీద తన తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ తో కలసి  కనిపించారు. ఆ తరువాత నుంచి నాగబాబు జోరు ఒక్కసారిగా పెంచేశారు.  ఈ మధ్యనే విడుదల అయిన పవన్ భీమ్లా నాయక్ కి ఏపీ సర్కార్ ఆంక్షలు పెట్టడంతో నాగబాబు మండిపోతున్నారు . ఇది పూర్తిగా సర్కార్ వారి  కక్ష సాధింపు చర్య అని బాగా  ఏకిపారేశారు.

ఒక వైపు సినీ రంగానికి మేలు చేస్తామని చెబుతూ మరో వైపు ఇలా చేయడం అంటే పవన్ని టార్గెట్ చేయడమే అని నిప్పులే చెరిగారు. దానికి వైసీపీ మంత్రుల నుంది గట్టిగానే రిటార్టు వచ్చింది. మేము ఎవరినీ టార్గెట్ చేయలేదని, పేర్ని నాని, కొడాలి నానీ చెప్పేశారు. పైగా పవన్ తీరు మీద కూడా హాట్ కామెంట్స్ అటు నుంచి వచ్చాయి.

దాంతో దానికి కౌంటర్లు వేశారు నాగబాబు. మిమ్మల్ని అంటే చిన్న మాట కూడా పడరా. అన్నింటికీ మీరు  అతీతులా, మీ పాలన ఎలా ఉందో మీకైనా కనీసం తెలుస్తోందా అని ఏకంగా వైసీపీ పెద్దల గాలి తీసేశారు. జగన్ బాగా పాలిస్తే తాము సంతోషిస్తామని, కానీ పగ ప్రతీకారమే పాలనగా ఉంటే అడగకూడదా అని నిలదీశారు.

ఇలా నాగబాబు మళ్లీ జోరు పెంచడానికి కారణం నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నికలు అని అంటున్నారు. ఉప ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో  తన అన్నను నిలబెట్టి గెలిపించుకోవాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారని అంటున్నారు. దాంతో నాగబాబు దూకుడు పెంచేశారు అంటున్నారు.

జగన్ మీద ఆయన నేరుగానే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాగబాబు ఆలోచించి మాట్లాడుతారు. ఆయన చేసే విమర్శలు గాలివాటుగా ఉండవు. అందులో లాజిక్కు ఉంటుంది. పాయింట్ కూడా ఉంటుంది. దాంతో ఆయన విమర్శలు తట్టుకోవడం అంటే వైసీపీ నేతలకు కష్టమే.

ఒక మేధావిగా, సగటు సిటిజన్ మాదిరిగా  ఆయన ప్రశ్నలు సంధిస్తూంటే జవాబు చెప్పడం అధికార పార్టీ నేతలకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే నాగబాబు ఇపుడు జనసేన హోదాలో కాకుండా సినీ రంగం సమస్యల మీదనే ప్రస్థావిస్తూ వస్తున్నారు. ముందు ముందు ఆయన ఏపీలో ప్రజల సమస్యల మీద కూడా పెద్ద  గొంతు చేస్తారని అంటున్నారు.

ఒక విధంగా ఏపీలో రాజకీయం మారుతోంది. జనసేన గేర్  మారుస్తోంది. తన బలాలను అన్నీ కూడా ఒక చోట చేర్చి సర్కార్ మీద బాణాలు వదలాలని నిర్ణయించుకుంది. అందులో భాగమే మెగా బ్రదర్ కూడా మళ్లీ నోరు గట్టిగా విప్పుతున్నారు అంటున్నారు. ఈ మధ్య కాలం దాకా పవన్, నాదెండ్ల మనోహర్ మాత్రమే జనసేన తరఫున మాట్లాడుతూ వచ్చారు. ఇపుడు మెగా బ్రదర్ బిగ్ సౌండ్ చేయడంతో జనసేన నుంచి సరికొత్త అస్త్రం వచ్చి చేరిందనే అనుకోవాలి.

ఈ రోజు నుంచి జనాల్లో ఉంటే నర్సాపురం ఉప ఎన్నికలో పోటీ చేసినా గెలుపు సులువు అవుతుంది అన్న ఆలోచనలు కూడా నాగబాబుకు ఉన్నట్లున్నాయని అంటున్నారు. అదే విధంగా సార్వత్రిక ఎన్నికలలో నాగబాబే జనసేనకు అసలైన స్టార్ కాంపెయినర్ గా మారబోతున్నారు అని కూడా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే మెగా బ్రదర్ ధాటిని ధీటుగా ఎదుర్కోవడం పైన వైసీపీ కూడా సీరియస్ గా కసరత్తు చేస్తోంది అంటున్నారు.
Tags:    

Similar News