కాపు ముఖ్యమంత్రి...కన్ఫార్మ్...?

Update: 2022-03-19 05:29 GMT
ఏపీలో ఈసారి  మారేదీ రాజకీయ మార్పిడి మాత్రమే కాదు, సామాజిక మార్పు కూడా అన్న సంకేతాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఏపీని దశాబ్దాలుగా కేవలం రెండే సామాజిక వర్గాలు ఏలుతూ వస్తున్నాయి. వారి చేతులలోనే మొత్తము రాజకీయం బంధీ అయిపోయిందన్న ఆవేదన అయితే మిగిలిన సామాజిక వర్గాల్లో ఉంది. ఇపుడు దాన్ని మార్చాలన్నదే ఇపుడు అజెండాగా ఉంది. ఆ దిశగా ఏపీలో బలమైన సామాజికవర్గం దూకుడుగా అడుగులు వేస్తోంది. అందులో భాగమే ఇటీవల ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగమని అంటున్నారు. పవన్ ఆషామాషీగా ఆ సభలో మాట్లాడలేదని అంటున్నారు. ఆయన ప్రతి మాట వెనకాల ఎన్నో అర్ధాలు ఉన్నాయని కూడా విశ్లేషిస్తున్నారు.

ఏపి బాధ్యతలు తాను తీసుకుంటానని పవన్ ధీమాగా చెప్పడం వెనక భారీ వ్యూహామే ఉందని చెబుతున్నారు. కాపులు ఇదివరకు మాదిరిగా మద్దతుదారులు కాదని, వారే ఇక మీదట రాజకీయాలలో పెద్దన్నలు అని అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడారు అని అంటున్నారు. ఇక పవన్ మాటలనే తీసుకుంటే రేపటి అధికారం తమదే అన్న భావన కూడా వ్యక్తం అయిందని తెలుస్తోంది.  నిజానికి కాపులు ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్నా వారిని కేవలం మంత్రులుగానే చూస్తున్నారు. గతంలో కూడా వారికి మంత్రి పదవులు బాగానే దక్కాయి.  ఏ ప్రభుత్వం ఉన్నా మంచి సంఖ్యలోనే మంత్రి పదవులు దక్కుతున్నాయి. అయితే అది తమకు సమ్మతం కాదని కాపులు అంటున్నారు. కొడితే కుంభస్థలాన్ని  కొట్టాలి అన్నదే కాపుల లేటెస్ట్ అజెండా. దానిలో భాగంగానే ఈ మధ్య తరచూ కాపు నేతలు సమావేశాలు జరుపుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులు అంతా కలసి నిర్వహిస్తున్న కాపు సమావేశాల్లో తీర్మానిస్తున్నది ఏంటి అంటే కాపులే ముఖ్యమంత్రి కావాలన్నది.  ఆ దిశగానే 2024 రాజకీయాలను పూర్తిగా తమకు అనుకూలంగా వాడుకోవాలన్నది ఆ అజెండా.

ఈ మధ్యనే విశాఖ జిల్లా పాయకరావుపేటలో కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాపుల నుంచే ఈసారి ఏపీకి ముఖ్యమంత్రి వస్తారని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలి. ప్రస్తుతం గంటా వంటి నేతలు అటు రాజకీయంగా కాపులను ఏక త్రాటిపైన ఉంచడంతో పాటు కాపుల మద్దతు విషయంలో కూడా పార్టీలకు షరతులు విధించాలి అన్న దాని మీదనే మధనం చేస్తున్నారు. ఈ నేపద్యం నుంచి చూసుకున్నపుడు కాపు సమావేశాల ప్రభావం పవన్ ఆవిర్భావ సభ పైన ఉందని అర్ధమవుతోంది. అంతే కాదు, పవన్ ప్రసంగం వెనక కాపు సమావేశాల తీర్మానం, సలహా సూచనలు ఉన్నాయని కూడా చెబుతున్నారు

మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయాల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. పాతిక శాతం పైగా ఓట్ల షేర్ ఉంది. మొత్తం 175 సీట్లలో సగానికి పైగా వారి ప్రభావం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలకు అయినా కాపుల మద్దతు అవసరం. వారు లేకుండా రాజకీయం చేయలేరు.

సరిగ్గా ఇలాంటి అనుకూల రాజకీయ సామాజిక పరిస్తితులనే ఆధారం చేసుకుని కాపులు ముఖ్యమంత్రి పీఠాన్ని ఈసారి కచ్చితంగా పట్టాలని చూస్తున్నారు. ఈ విషయంలో జనసేనని ముందు పెట్టి వెనకాల రాజకీయం చేసే వారు చాలా మంది ఉన్నారని అంటున్నారు. అందువల్ల ఆరు నూరు అయినా ఈసారి కాపు సీఎం ఖాయమని ఢంకా భజాయిస్తున్నారు. తమ అండ లేనిదే అధికారంలోకి రాలేని టీడీపీ వంటి పార్టీలను దారికి  తెచ్చుకోవడానికి కాపులు అడే మైండ్ గేమ్ ఎలా ఉంటుందో రాజకీయ తెర మీద చూడాల్సిందే
Tags:    

Similar News