మిలటరీ చర్యల వేళ రష్యాలో అలా.. ఉక్రెయిన్ లో ఇలా

Update: 2022-02-25 02:28 GMT
ఏ రెండు దేశాల మధ్య ఏ మాత్రం మొదలు కాకూడని యుద్ధం అనూహ్యంగా మొదలు కావటం.. ఇది కాస్తా ఏ రూపులోకి మారుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారటమే కాదు.. యావత్ ప్రపంచం బితుకు బితుకు మంటోంది. మొన్నటి వరకు వెంటాడి వేధించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఉపశమనం పొందుతున్న వేళ.. అనూహ్యంగా వచ్చి పడిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ప్రజలకు కొత్త దిగులును తీసుకొచ్చింది.

తాజాగా మొదలైన యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూడటమే కాదు.. ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. బంగారం ధరల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఉక్రెయిన్ మీద మిలటరీ చర్యను డిక్లేర్ చేస్తూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్న తర్వాత రష్యాలో ఏం జరిగిందో తెలుసా? రష్యన్లు పలువురు తమ సోదర సమానులైన ఉక్రేయిన్ల మీద దాడి చేయటాన్ని ఇష్టపడటం లేదు.

ఉక్రెయిన్ మీద సైనిక చర్యలకు పుతిన్ తీసుకున్న నిర్ణయం మీద ఆ దేశ ప్రజలు(రష్యన్లు)ఆందోళన వ్యక్తం చేయటమే కాదు.. రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టటం గమనార్హం. తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని రష్యన్లు పలువురు కోరుతున్నారు. అయినప్పటికీ పుతిన్ మాత్రం తన మొండితనాన్ని విడనాడకుండా.. ఉక్రెయిన్ మీద అధిక్యతను ప్రదర్శించి.. అధిపత్యాన్ని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. రష్యా దాడి చేసిన ఉక్రెయిన్ లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఉక్రెయిన్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ మీద ఆధిపత్యం కోసం తపిస్తున్న పుతిన్ విషయంలో ఎంతో కొంత దెబ్బ తీయాలని భావిస్తున్నారు. మహిళలు సైతం కోపంతో ఉన్నారు. తమ స్వేచ్ఛను హరిస్తున్న పుతిన్ తీరును వారు తప్పు పడుతున్నారు. ఏదైనా దేశంలో యుద్ధం మొదలైతే.. ఆ దేశస్తులు పలువురు.. మనకెందుకు బాబు అన్నట్లుగా దేశాన్ని విడిచి వెళ్లిపోవటం చూస్తుంటాం.

కానీ.. ఉక్రెయిన్ ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. వేరే దేశానికి వెళ్లేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా.. దేశ క్షేమం కోసం తమ వంతు సాయం చేయాలన్న కసితో ఉండటం గమనార్హం. వేరే దేశాలకు వెళ్లే వీలున్నప్పటికీ.. తమకు ఆ ఆలోచన లేదని.. తమ ప్రాణాల కంటే ముందు దేశాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని వారు బలంగా కోరుకుంటున్నారు. యుద్ధం చేస్తున్న రష్యాలో అక్కడి ప్రజలు వార్ ను వ్యతిరేకిస్తుంటే.. తమపై యుద్ధాన్ని రుద్దుతున్న రష్యాపై ఉక్రెయిన్లు మాత్రం కారాలు మిరియాలు నూరుతూ.. ఏదో ఒకటి చేయాలన్న పట్టుదలతో మాత్రం ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News