టీడీపీ ధీమా అది.. వింటున్నావా జనసేనానీ... ?

Update: 2022-03-22 00:30 GMT
తెలుగుదేశం పార్టీ నిన్నా మొన్న పుట్టిన పార్టీ కానే కాదు, ఆ పార్టీ ఎత్తులు వ్యూహాలూ గొప్పగా ఉంటాయి. ఏమీ లేకుండా ఏమీ కాకుండా నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ దేశంలోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కీలకపాత్ర పోషించే పరిస్థితి ఉంటుందా. అలాంటి తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో కొంత తగ్గితే తగ్గి ఉండవచ్చు. పరాభవం ఒక రేంజిలో జరిగితే జరగవచ్చు. కానీ టీడీపీని ఏమీ కాకుండా పక్కన పెట్టడం అంటే తెలుగు రాజకీయాల్లో అందునా ఆంధ్రా రాజకీయాల్లో అసలు కుదిరే పనే  కాదు.

అందుకే ఆ పార్టీ బిగ్ సౌండ్ చేస్తోంది. అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న నిమ్మల రామానాయుడు అయితే పొత్తులు లేకపోయినా బ్రహ్మాండంగా టీడీపీ గెలుస్తుంది అని కుండబద్ధలు కొట్టారు. ఒక చానల్ లో మాన్సులో మాటను ఆయన విప్పిచెబుతూ  పొత్తులు ఎత్తులు అన్నవి ఎన్నికల వ్యూహాలు అంటూనే ఏపీలో టీడీపీ ఈ రోజుకు ఎన్నికలు పెట్టినా వంద నుంచి 110 సీట్లను కైవశం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఏపీలో జగన్ని ఓడించాలంటే అందరూ ఒకే త్రాటి మీదకు రావాల్సిన అవసరం ఉంది. అపుడు అయితే కచ్చితంగా 160 సీట్లు టీడీపీతో కూడిన కూటమి పరం అవుతాయని లెక్కలు వేసి మరీ చెప్పారు అపుడు అధికార వైసీపీకి కేవలం 15 సీట్లు మాత్రమే దక్కుతాయని వైసీపీకి భయంకరమైన ఫ్యూచర్ ని కూడా కళ్ల ముందుంచారు.

సరే ఇవన్నీ పక్కన పెడితే మాత్రం నిమ్మల రామానాయుడు అన్న మాటలనే తీసుకుంటే పొత్తులు లేకపోయినా సింగిల్ గా బరిలోకి దిగినా ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లను దాటి మరో ఇరవై పాతిక సీట్లు ఆ పార్టీ ఎక్కువే గెలుచుకుంటుందని కూడా నిమ్మల సరైన అంచనా  వేశారు. మరి ఏపీలో తానే పెద్దన్న పాత్ర పోషిస్తాను అని అందరినీ కలుపుతాను అని పవన్ ఈ మధ్యనే జరిగిన ఆవిర్భావ సభలో చెప్పారు. మిగిలిన పార్టీలు అన్నీ కూడా భేషజాలు విడిచి తన వైపునకు రావాలని బహిరంగంగా ఆయన అప్పీల్ చేశారు.

మరి దాన్ని కనుక తీసుకుంటే టీడీపీ ఓటమి భయంతో ఉందన్నట్లుగానే విశ్లేషణ కనిపిస్తోంది. కానీ టీడీపీ లాంటి క్యాడర్ బేస్డ్ పార్టీకి దాని బలం దానికి ఉంటుంది. ఏపీలో ప్రతీ పోలింగ్ బూత్ లో కూడా టీడీపీకి క్యాడర్ ఉంది. అలాంటి పార్టీ పొత్తులు లేకుంటే ఓడిపోతుందని జనసేనకు కానీ మిగిలిన వారికి కానీ భ్రమలు ఉంటే అవన్నీ పటాపంచలు చేసేలా నిమ్మల వారు గట్టిగానే చెప్పారనుకోవాలి. మరి ఇపుడు పొత్తుల కోసం ఎవరు ఎవరి వైపు రావాలో, అధికారం కోసం ఎవరు వైపునకు చేరాలో పక్కా క్లారిటీ టీడీపీ ఇచ్చినట్లే అంటున్నారు. చూడాలి మరి దీని మీద జనసేన నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో.
Tags:    

Similar News