టీడీపీకి యువ ర‌క్తం ! రా క‌ద‌లి రా

Update: 2022-03-22 13:30 GMT
టీడీపీలో యువ ర‌క్తం ఉర‌క‌లెత్తుతోంది. ప‌ర‌వొళ్లు తొక్కుతోంది.గ‌తం క‌న్నా భిన్నంగా యువ నాయ‌కులు ఒక్కొక్క‌రూ తెర‌పైకి వ‌స్తున్నారు. లోక్ స‌భ మాజీ స్పీక‌ర్, దివంగ‌త నేత బాల‌యోగి కుమారుడు హ‌రీశ్ బాల‌యోగి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అమ‌లాపురం ఎంపీగా పోటీచేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

ఇవాళ (మార్చి 22)ఆయ‌న జన్మ‌దినం. శుభాకాంక్ష‌లు చెబుతూ..ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు యువ నాయ‌కుల గురించి తెలుసుకుందాం.ముఖ్యంగా కింజ‌రాపు కుటుంబం నుంచి కింజ‌రాపు కృష్ణ‌మోహ‌న్ తో పాటు కింజ‌రాపు సురేశ్ కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయి ఉన్నారు.

ఇప్ప‌టికే వీరిద్ద‌రూ అధినేత చంద్ర‌బాబు నాయుడ్ని క‌లిశారు.ఆయ‌న ఆశీస్సులు అందుకున్నారు.అన్న కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు స్ఫూర్తితో రాజ‌కీయ క్షేత్రంలోకి రావాల‌ని భావిస్తున్నారు. అచ్చెన్న కుమారుడు కృష్ణ మోహ‌న్ ఇప్ప‌టికే యాక్టివ్ అయ్యారు. అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ ప‌నుల‌తో పాటు టీడీపీ డిజిట‌ల్ వింగ్ కు సంబంధించి కూడా కొన్ని ప‌నులు చ‌క్క‌దిద్దుతున్నారు.

మ‌రో యువకుడు సురేశ్ తండ్రి కింజ‌రాపు హ‌రి వ‌ర ప్ర‌సాద్.ఈయ‌న కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు త‌మ్ముడు.ఈయ‌న కూడా క్రియాశీల రాజ‌కీయాల్లోనే ఉన్నారు. కోట‌బొమ్మాళి కేంద్రంగా మంచి పేరున్న స్థానిక నేత. అన్న‌య్య పేరు నిలబెట్టే  క్ర‌మంలో ఇవాళ ఆ అన్న‌ద‌మ్ములంతా టీడీపీ కోసం ప‌నిచేస్తూ, త‌మ వార‌సుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో అదే కింజ‌రాపు కుటుంబ బంధువు మెండ దాసునాయుడు తెలుగు యువ‌త శ్రీ‌కాకుళం జిల్లా అధ్య‌క్షులుగా ఉన్నారు.ఈయ‌న కూడా ఎంపీ అడుగుజాడల్లో న‌డుస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

వివాద ర‌హితుడిగా పేరుంది. ప్ర‌జా స‌ద‌న్ (ఎంపీ కార్యాల‌యం, శ్రీ‌కాకుళం) నిర్వ‌హ‌ణ‌లోనూ మ‌రియు ఎంపీ రామూ చేపట్టే సామాజిక కార్య‌క్ర‌మాల్లోనూ ముందుంటారు. లాక్డౌన్ వేళ‌ల్లో ఎంపీ రామూ త‌ల‌పెట్టిన అన్న‌దాన క్ర‌తువును ముందుండి న‌డిపారు.

అదేవిధంగా ఎంపీ రామూ ఇచ్చిన పిలుపు మేర‌కు అప్ప‌టి ప‌రిస్థితుల రీత్యా ర‌క్త‌దాన శిబిరాన్ని నెల రోజుల పాటు నిరాటంకంగా న‌డిపి మూడు వంద‌ల యూనిట్ల‌కు పైగా ర‌క్తం సేక‌రించి రెడ్ క్రాస్ కు అందించి అప్ప‌టి క‌లెక్ట‌ర్ నివాస్ మ‌న్న‌న‌లు అందుకున్నారు.

మ‌రో యువ‌కుడు విజ‌య‌నగ‌రం కేంద్రంగా ఉన్న వేమ‌లి చైత‌న్య బాబు.ఈయ‌న ఆ జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్షులుగా ఉన్నారు.నిన్న‌టి వ‌ర‌కూ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ (టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. ఎంటెక్ చ‌దువుకున్న వేమ‌లి చైత‌న్య బాబు వివాద ర‌హితులు.

మంచి భాష మాట్లాడ‌డ‌మే కాదు నిబ‌ద్ధ‌త‌తో కూడిన రాజ‌కీయమే చేస్తాన‌ని అంటారు. ప్ర‌జా క్షేత్రంలో స‌మ‌స్యల ప‌రిష్కారానికి నిరంత‌రం ప‌నిచేయ‌డ‌మే త‌ప్ప ప‌దవులు ఆశించి తాను పార్టీ లో లేన‌ని కూడా స్ప‌ష్టం చేస్తారు. ఈయ‌న‌తో పాటే మ‌రో యువ‌కుడు కిమిడి నాగార్జున..విజ‌య న‌గ‌రం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్య‌క్షులుగా ఉన్నారు.

వీరు కూడా మంచి నాయ‌కులుగా పేరు తెచ్చుకుంటున్నారు.వీరి మాతృమూర్తి కిమిడి మృణాళిని మాజీ మంత్రి వ‌ర్యులు. శ్రీ‌కాకుళం జెడ్పీ చైర్మ‌న్ గా ప‌నిచేశారు. వీరి బాబాయి కిమిడి క‌ళావెంక‌ట్రావు మాజీ మంత్రి వ‌ర్యులు..తెలుగు దేశం పార్టీ ఆంధ్ర ప్ర‌దేశ్ విభాగ అధ్యక్షులుగా ప‌నిచేశారు. వీరి అబ్బాయి రామ్ మ‌ల్లిక్ నాయుడు కూడా ఇటుగా వ‌చ్చారు. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుంటూ వివాదాల‌కు దూరంగా ఉంటున్నారు.
Tags:    

Similar News