ట్రాఫిక్ చలానాలకు డిస్కౌంట్ మేళా వచ్చేసింది..ఈ రోజు నుంచే మొదలు

Update: 2022-03-01 04:50 GMT
కారణం ఏమైనా కానీ రూల్ ప్రకారం వాహనాన్ని నడపనందుకు ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉండే పోలీసులు.. కెమేరా కళ్లు వేసిన చలనాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. లక్షల్లో కేసులు పెండింగ్ ఉండటం.. కాగితాల్లో తప్పించి ఖజానాకు చేరని ఫైన్లను రాబట్టుకోవటం కోసం తెలంగాణ పోలీసులు సరికొత్త డిస్కౌంట్ పథకాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయానికి వస్తే.. హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపటం.. ఓవర్ స్పీడ్.. రాంగ్ సైడ్ పార్కింగ్.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ లాంటి తప్పులు చేయటం.. వాటికి సంబంధించిన చలానాలు ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో ఉండటం తెలిసిందే.

ఇప్పుడు ఆ చలానాల్ని భారీ రాయితీని ఇవ్వటం ద్వారా.. చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశం లభించింది. ఇందుకోసం ఈ రోజు (మార్చి 1) నుంచి ఈ నెలాఖరు (మార్చి 31) వరకు అవకాశాన్ని కల్పించారు. ఇంతకూ ఏ వాహనాన్ని ఎంత రాయితీ ఇచ్చారు? ఎంత ఫైన్ ఎంత చెల్లిస్తే సరిపోతుందన్న దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను సిద్ధం చేశారు.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టూవీలర్.. ఆటోలకు పడిన చలానాలకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉదాహరణకు చలానా మొత్తం రూ.1000 అనుకుంటే.. తాజాగా ఇస్తున్న డిస్కౌంట్ తో కేవలం రూ.250 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. చలానాలో ఫైన్ కింద రూ.100 విధిస్తే.. రూ.35 సర్వీసు ఛార్జి కింద వేస్తారు. డిస్కౌంట్ టోటల్ మొత్తానికా? కేవలం ఫైన్ కు మాత్రమేనా? అంటే.. టోటల్ కు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

అంటే.. రూ.100 ఫైన్.. సర్వీసు ఛార్జి రూ.35గా విధించటం తెలిసిందే. మరి.. ఈ రూ.135 మొత్తానికి ఎంత చెల్లించాలంటే అందులో 75 శాతం తీసేస్తే.. రూ55.55 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇదే రూల్ అన్ని వాహనాలకు వర్తిస్తుందని చెబుతున్నారు. ఇక.. కార్లు.. లారీలు.. ఇతర వాహనాలకు విధించిన చలానాల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు.

మరి.. ఆర్టీసీ డ్రైవర్ల మీదా చలానాలు ఉన్నాయి. వాటి సంగతేమిటన్నది చూస్తే.. ఈ విషయంలో ఆర్టీసీ బస్సును కాకుండా.. బస్సు డ్రైవర్ వ్యక్తిగత ఖాతాలో చలానాలు వేశారు. ఇలాంటి వాటిపై 70 శాతం రాయితీ ఇచ్చి.. కేవలం 30 శాతం చెల్లిస్తే సరిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ వేళ మాస్కులు ధరించకుండా బయటకు వచ్చి కేసులు బుక్ అయిన వారి విషయానికి వస్తే.. వారికి విధించిన ఫైన్ లో 90 శాతంరాయితీ ఇచ్చారు. అంటే రూ.వెయ్యి ఫైన్ కు రూ.100 చెల్లిస్తే సరిపోతుందన్న మాట.

తాజాగా తీసుకొచ్చిన రాయితీతో రాష్ట్ర ఖజానాకు రూ.500 కోట్ల కంటే ఎక్కువే జమ అవుతాయని భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 కోట్ల వరకు చలానాలు ఉన్నట్లుగా అంచనా. ఈ నేపథ్యంలో పేరుకు పోయిన కేసుల్ని తగ్గించుకోవటంతో పాటు.. పేరుకు చలానాలు మాత్రమే కానీ.. అవేమీ చెల్లింపులు కాని నేపథ్యంలో ఈ బంపర్ ఆఫర్ ను తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారని చెప్పక తప్పదు.

ఈ రాయితీల ఆఫర్ ఈ నెల (మార్చి) 1 నుంచి మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. కరోనా వేళ.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి.. తాజాగా ప్రకటించిన చలానా ఆఫర్ భారీ ఉపశమనంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇంకెందుకు ఆలస్యం.. మీకున్న చలానాల్ని వెంటనే క్లియర్ చేసేయండి.
Tags:    

Similar News