ఉక్రెయిన్ సరిహద్దులకు 100కి.మీ. దూరంలో బైడెన్

Update: 2022-03-26 03:28 GMT
ఉక్రెయిన్ - రష్యాల మధ్య గడిచిన నెల రోజులుగా సాగుతున్న యుద్దం ఒక కొలిక్కి వచ్చేస్తుందన్న వార్తలు వస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. మరి కొద్ది రోజుల్లో ఉక్రెయిన్ రష్యా వశం కానుందన్న వాదన బలంగా వినిపిస్తున్న వేళ.. ఉక్రెయిన్ దేశ సరిహద్దుకు కేవలం వంద కి.మీ. దూరంలోని పోలాండ్ కు చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా పోలాండ్ లోని రెజెస్టో పట్టణంలోకి అడుగు పెట్టారు.

ఓపక్క ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా బాంబుదాడులు చేస్తున్న వేళ.. ఆ ప్రాంతానికి అత్యంత సమీపానికి అమెరికా అధ్యక్షుడు రావటం ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో బైడెన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. పోలాండ్ తో సహా యూరోపియన్ దేశాలు (ఈయూ) అప్రమత్తమయ్యాయి. రెజెస్టో పట్టణానికి చేరుకున్న బైడెన్..అక్కడే ఉన్న ఉక్రెయిన్ శరణార్ధుల పరిస్థితుల గురించి ఆరా తీస్తారు.. వారికి అందుతున్న సహాయ చర్యల గురించి స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడనున్నారు.

అంతేకాదు.. అక్కడే ఉన్న 82వ అమెరికా ఎయిర్ బోర్న్ డివిజన్ సభ్యులతో మాట్లాడనున్నారు.  సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉక్రెయిన్ లో నెలకొన్న సంక్షోభం.. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ప్రణాళిక.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చించటంతో పాటు.. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాతో బైడెన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాజా పర్యటనలో మరిన్ని అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. రష్యా చేస్తున్న దాడి నేపథ్యంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 22 లక్షల మంది ఉక్రెయిన్లు తమ దేశంలోకి శరణార్థులుగా వచ్చినట్లుగా పోలాండ్ పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల్ని ప్రయోగించేందుకు అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ.. తాము మాత్రం ఎలాంటి దాడి చేసే ఆలోచనలు లేవంటూ అమెరికా కీలక ప్రకటన చేయటం గమనార్హం. అయితే.. ఉక్రెయిన్ కు అమెరికాతో పాటు నాటో దేశాలన్నీ పూర్తి సహకారాన్ని అందిస్తామని చెబుతున్నారు.

బైడెన్ తాజా పర్యటనలో యూరోపియన్ దేశాలతో అమెరికా కొన్ని కీలక ఒప్పందాల్ని చేసుకోనుంది. అందులో ముఖ్యమైనది.. ఇంతకాలం ఈయూ దేశాలకు రష్యానే సహజ వాయువును సరఫరా చేస్తుండేది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈయూ దేశాలు రష్యా మీద ఆధారపడకుండా ఉండేలా అవసరమైన ఏర్పాట్లకు అమెరికా సహజ వాయువును అందించనుంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బైడెన్ పోలాండ్ పర్యటన సర్వత్రా ఉత్కంఠ నెలకొనేలా చేసిందని చెప్పాలి.
Tags:    

Similar News