గుంటూరులో రాజ‌కీయ `శివ‌రాత్రి`.. రీజ‌న్ ఇదే!

Update: 2022-03-01 10:30 GMT
గుంటూరు జిల్లాలోని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో `రాజ‌కీయ శివ‌రాత్రి`కి తెర‌దీసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యే మ‌ధ్య శివ‌రాత్రి సెంట్రిక్‌గా వివాదాలు సాగుతున్నాయి.  న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుకు, ఇదే జిల్లాలోని చిల‌క‌లూరిపేట  ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ ఏడాది శివ‌రాత్రి విష‌యానికి వ‌స్తే.. ఇరువురు నేత‌ల మ‌ధ్య మ‌రింత‌గా ఈ వివాదం పెరిగిన‌ట్టు తెలుస్తోంది. దీనికి కార‌ణం.. న‌ర‌స‌రావుపేట పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న కోట‌ప్ప‌కొండ దేవ‌స్థాన‌మే!

ఈ ఆల‌యంపై పెత్తనంకోసం.. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే కూడా పోటీ ప‌డుతున్నారు. గ‌త ఏడాది కోట‌ప్ప‌కొండ ప్ర‌భ‌ల సంద‌ర్భంగా ఈ నేత‌ల.. అనుచ‌రులు.. రాళ్ల దాడికి కూడా దిగారు. ఈ విష‌యం ఏకంగా.. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అయితే..అప్ప‌ట్లో కీల‌క నేత‌లు రంగంలోకి దిగి ఎమ్మెల్యే త‌ర‌ఫున ఎంపీతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసి.. స‌ర్దుబాటు చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి పెద్ద‌గా ఇరువురు నాయ‌కులు కీచులాడుకోవ‌డం త‌గ్గించారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి శివ‌రాత్రి సంబ‌రాల‌కు కోట‌ప్ప కొండ రెడీ అయింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం రూ.40 కోట్లు ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇక‌, ఈ ఆల‌యం న‌ర‌సారావుపేట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉండ‌డంతో ఎంపీ లావు కూడా కొంత మొత్తం కేటా యించారు. ఈ నిధుల వినియోగం నుంచి కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల వ‌ర‌కు ప్ర‌తి కార్య‌క్ర‌మం విష‌యంలోనూ.. ఇరు ప‌క్షాల నాయ కులు ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి. అంతేకాదు.. ప్రొటోకాల్ నిబంధ‌న‌ల మేర‌కు అనుస‌రించే అధికారుల‌పైనా.. ఒత్తిళ్లు పెరగ‌డంతో ఆల‌యానికి సంబంధించిన కీల‌క అధికారి ఏకంగా.. మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు ద‌గ్గ‌ర పంచాయితీ పెట్టార‌ని తెలిసింది.

మంత్రి ఈ విష‌యంపై ఎటూ తేల్చ‌లేక .. చేతులు ఎత్తేశారు. ఒక‌రు కీల‌క‌మైన ఎంపీ.. మ‌రొక‌రు అధిష్టానానికి అత్యంత విశ్వాస‌పాత్రురాలిగా ఉన్న ఎమ్మెల్యే కావ‌డంతో.. మంత్రి ఏమీ చేయ‌లేక త‌ప్పుకొన్నారు. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వం ఇక్క‌డ తాత్కాలిక అధికారికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. ఆయ‌న‌కు ఇక్క‌డి రాజ‌కీయాలు తెలియ‌క‌పోవ‌డంతో.. ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చూడాలి. మ‌రోవైపు.. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్ద‌రూ కూడా పెత్త‌నంపై పెద్ద చేయే చేసుకుంటున్నార‌ట‌! దీంతో ఈ శివ‌రాత్రి వైసీపీలో రాజ‌కీయ శివ‌రాత్రిగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News