40 ఇయర్స్ టీడీపీ : ఇక్క‌డ ఎవ‌రి (వి)వాదాలు వారివి ?

Update: 2022-03-29 05:30 GMT
గ‌త కొద్ది కాలంగా టీడీపీ వెనుకంజ‌లో ఉంది. ఆ మాట‌కు వ‌స్తే మూడేళ్లుగా ప్ర‌జా పోరాటాలు పేరితో చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏవీ పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.అస‌లు పార్టీ లోనే ఉన్న లుక‌లుక‌లు స‌ర్దుకోలేదు స‌రిక‌దా ! కొత్త‌గా చేసేదేంట‌న్న‌ది ఓ వాద‌న. విజ‌య‌న‌గ‌రం లాంటి జిల్లాల‌లో బ‌ల‌మైన నేత మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఢీకొనేందుకు అక్క‌డి యువ నాయ‌క‌త్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అక్క‌డి  టీడీపీ జిల్లా అధ్య‌క్షులు కిమిడి నాగార్జున మంచి పోరాటమే చేస్తున్నారు. ఇందుకు తెలుగు యువ‌త అధ్య‌క్షులు వేమ‌లి చైత‌న్య బాబు, టీఎన్ఎస్ఎఫ్ లీడ‌ర్ భాను శ‌క్తి వంచ‌న లేకుండా స‌హ‌క‌రిస్తున్నారు. అంత‌టి స్థాయిలో శ్రీ‌కాకుళం యువ నాయ‌క‌త్వం లేదు. ఆ మాట‌కు వ‌స్తే చింత‌కాయ‌ల విజ‌య్ (న‌ర్సీప‌ట్నం లీడ‌ర్ , మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుమారుడు ) కానీ ఇటు మెండ దాసు నాయుడు (శ్రీ‌కాకుళం తెలుగు యువ‌త జిల్లా విభాగ అధ్య‌క్షులు) చేస్తున్న కృషి క్షేత్ర స్థాయిలో క‌నిపించ‌డం లేదు.

ఇక విశాఖ‌ను క‌దిపేస్తున్న కుదిపేస్తున్న స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మీడియా ముఖంగా నాలుగు మాట‌లు చెప్ప‌డ‌మే కానీ ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ‌లోకి దూకింది లేదు.గ‌తంలో అనేక వివాదాల్లో ఇరుక్కున్న ఈ సీనియ‌ర్ లీడ‌ర్ కొడుకు బండారు అప్ప‌ల నాయుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ ఆయ‌న కూడా పెద్ద‌గా రాణించ‌లేక పోతున్నారు. ఇక శ్రీ‌కాకుళంలో కూడా వ‌ర్గ విభేదాలు నివురు కప్పిన నిప్పులానే ఉన్నాయి. వీటిని కూడా ప‌రిష్క‌రించాలి. ఇవి కాకుండా మ‌రో ప్ర‌ధాన వివాదం లోకేశ్ నాయక‌త్వాన్ని అంగీక‌రించ‌డం.

గ‌త కొద్దిరోజులుగా తారక్ ను మ‌ళ్లీ సీన్ లోకి తేవాల‌ని యోచిస్తున్నారు అధినేత చంద్ర‌బాబు. కానీ ఆ మ‌ధ్య త‌న అత్త భువ‌న‌మ్మ‌ను ఉద్దేశించి వైసీపీ నాయ‌కులు అత్యంత అవ‌మాన‌క‌ర రీతిలో మాట్లాడినా ఆయ‌న ఇచ్చిన రియాక్ష‌న్ అంత‌గా లేద‌ని క‌నుక తార‌క్ ను తీసుకు రావ‌డంతో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని కూడా కొంద‌రు అంటున్నారు. ఇదే తార‌క్ 2009లో కూడా ప్ర‌చారం చేశారు క‌దా ఏమ‌యింది అన్న ప్ర‌శ్న పార్టీలో వినిపిస్తోంది.

ఓ విధంగా చాలా మంది లీడ‌ర్లు చంద్ర‌బాబును త‌ప్ప మ‌రో ముఖాన్ని త‌మ పై రుద్ద వ‌ద్ద‌నే అంటున్నారు. ఆ విధంగా లోకేశ్ ను కానీ ఆ విధంగా తార‌క్ ను కానీ పెద్ద‌గా ప్రోత్స‌హించే స్థితిలో సీనియ‌ర్లు కూడా లేరు. తార‌క్ వ‌స్తే రేపు తాము గెలిస్తే ఆ ఫ‌లితం ఆయ‌న ఖాతాలో సునాయాసంగా ప‌డిపోతుంద‌ని అప్పుడు త‌మ‌కు పెద్ద‌గా జ‌నం ద‌గ్గ‌ర విలువ లేకుండా పోతుంద‌ని,క్యాడ‌ర్ కూడా త‌మ‌కు పెద్ద‌గా గౌర‌వం అందించ‌ర‌ని కూడా అంటున్నారు ఇంకొంద‌రు.

ఎందుకంటే 2014 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతోనే తాము గెలిచామ‌న్న వాద‌న ఇప్ప‌టికీ ఆ పార్టీ మ‌రియు ప‌వ‌న్ మ‌నుషులు ప్ర‌స్తావిస్తూ ఓ విధంగా త‌మను దెప్పి పొడుస్తున్నార‌ని  ఇదే స‌మ‌యంలో వైసీపీ కూడా జ‌న‌సేన‌కు వంత పాడుతుంద‌ని కొంద‌రు నాయ‌కులు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. అందుకే ఈ వివాదం ఇప్ప‌టికే బాబు దగ్గ‌ర‌కు వెళ్లినా సంబంధిత నిర్ణ‌యం కానీ అభిప్రాయం కానీ వెలుగులోకి రాలేదు. కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం మాదిరి స‌రైన సమ‌యంలో సరైన నిర్ణ‌యం అన్న విధంగానే అధినేత ఉంటున్నారు అని కూడా తెలుస్తోంది. వీటిని ప‌రిష్క‌రిస్తే నేటి (మార్చి 29,2022, మంగ‌ళ‌వారం) ఆవిర్భావ వేడుక  నుంచి కొత్త శ‌కం ఒక‌టి ఆరంభం కావొచ్చు.
Tags:    

Similar News