అమరావతి క్వార్టర్స్ నిర్మాణాలు మళ్లీ స్టార్టైపోయాయి

Update: 2022-03-22 05:32 GMT
రాబోయే నవంబర్ నాటికి అమరావతి ప్రాంతంలోని ఐఏఎస్, ఎంఎల్ఏల క్వార్టర్స్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత క్వార్టర్స్ నిర్మాణాలు ఎక్కడివక్కడే  ఆగిపోయిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు జోక్యం చేసుకుని అక్షింతలు వేసిన తర్వాత కానీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. అమరావతి రాజధాని నిర్మాణంపై దాఖలైన కేసులను విచారించి ఆరు మాసాల్లో రాజధానిని పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

హైకోర్టు ఆదేశాల తర్వాతే రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఇపుడు ఐఏఎస్, ఎంఎల్ఏ క్వార్టర్స్ నిర్మాణాలు కూడా మొదలవ్వబోతోతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చేనాటికే క్వార్టర్స్ భవనాలు దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి.

అధికారంలోకి వచ్చిన జగన్ వీటిని పట్టించుకోకపోవటంతో మొత్తం రాజధాని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. క్వార్టర్స్ నిర్మాణానికి బ్యాంకుల కన్సార్షియం రు. 200 కోట్లిచ్చింది. ఇందులో సుమారు రు. 95 కోట్లు వాడేశారు. అయితే కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం చెల్లించలేదు.

తాజా నిర్ణయంతో ముందు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన రు. 105 కోట్లతో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కూడా కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చింది.

అవసరమైన నిధుల కోసం బ్యాంకుల కన్సార్షియం తో ప్రభుత్వం మాట్లాడుతోంది. మొత్తం మీద పెండింగ్ పనులను పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించటం సంతోషమే. ఎందుకంటే సగం పనులయిన భవనాలను అలా వదిలేయటం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు.

కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం కన్నా పనులు పూర్తిచేసి ఆ భవనాలను ఏదో రూపంలో ఉపయోగంలోకి తీసుకురావటమే మంచిది. కానీ జగన్ ప్రభుత్వం ఆ పని చేయకుండా మొండిగా వదిలేసింది. చివరకు కోర్టు జోక్యంతో పనులు మొదలవుతున్నాయి. దీనివల్ల భవనాలు ఉపయోగంలోకి రావటమే కాకుండా వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుంది.
Tags:    

Similar News