కామెడి స్టార్ చేతిలో పంజాబ్ పగ్గాలు

Update: 2022-03-10 10:30 GMT
పంజాబ్ ప్రభుత్వ పగ్గాలు కామెడి స్టార్  చేతిలోకి వచ్చేశాయి. ఒకపుడు వృత్తిపరంగా కామెడి స్టారే అయిప్పటికీ ఇపుడు మాత్రం పూర్తిస్ధాయి రాజకీయ నేతనే చెప్పాలి. ఇంతకీ ఆయన ఎవరంటే ఆయనే ఆప్ తరపున పంజాబ్ సీఎం అభ్యర్ధి భగవంత్ సింగ్ మాన్.  ఆప్ తరపున ప్రస్తుతం సంగ్రూర్ లోక్ సభ ఎంపీగా ఉన్న మాన్ తొందరలోనే పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఎందుకంటే ఇపుడు ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి.

 మాన్ కామెడి స్టార్ ఎలాగయ్యారంటే డిగ్రీ చదువుకునే రోజుల్లో హాస్యం (కామెడి)పోటీల్లో ఎక్కువగా పాల్గొనేవారు. ఢిగ్రీ కాలేజీల స్ధాయిలో జరిగిన పోటీల్లో రెండుసార్లు విజేతగా నిలిచి బంగారు పతకాలు కూడా సాధించారు.

తర్వాత దాన్నే వృత్తిగా ఎంపికచేసుకున్నారు. దేశ రాజకీయాలు, ఆర్ధిక స్ధితిగతులు, వాణిజ్యం, క్రీడారంగం, సమకాలీన రాజకీయాలు తదితరాలను అంశాలుగా తీసుకుని ఎన్నో కామెడీ స్కిట్లు ప్రదర్శించి బాగా పాపులరయ్యారు.

 పంజాబ్ తో పాటు కెనడా, ఇంగ్లాండ్ దేశాల్లో తిరిగి ఎన్నో కామెడి ఆల్బమ్లు ఇచ్చారు. 2008 వరకు స్టాండప్ కామెడి షోలతో చాలా బిజీగా ఉన్న మాన్ 2011లో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. 2012లో లెహ్రా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు.

తర్వాత ఆప్ లో చేరి సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీచేసి 2.11 లక్షల భారీ మెజారిటితో గెలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జలాలాబాద్ నుండి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ రెండోసారి ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఎంపీగా లోక్ సభలో మాన్ కు మంచి ట్రాక్ రికార్డే ఉంది.

 మాన్ కున్న పాపులారిటి, ఎంపీగా ట్రాక్ రికార్డు ఘనంగా ఉంది కాబట్టే ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎంపికచేశారు. తాజా ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించటంతో మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలు చుట్టుముట్టిన సమయంలో బాధ్యతలు తీసుకుంటున్న మాన్ ఏ విధంగా నెగ్గుకొస్తారో చూడాలి.
Tags:    

Similar News