చంద్రబాబు నథింగ్... నిజంగా నిజమేనా ...?

Update: 2022-03-16 08:30 GMT
రాజకీయాల్లో అతి విశ్వాసం ఎపుడూ పనికి రాదు. ఆత్మ విశ్వాసం ఉంటే విజయాలు సాధించవచ్చు. అదే టైమ్ లో ఎక్కువగా ధీమా పడినా కూడా ఇబ్బందే. అసలుకే ఎసరు వస్తుంది. ఇది తెలియని వారు ఎవరూ లేరు కానీ అధికార‌ పీఠాలు అధిరోహించాక ఒక్కోసారి తెలియని ధైర్యం వస్తుందేమో. ఇవన్నీ ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా జరిగిన వైసీఎల్పీ సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాటిలో అతి ముఖ్యమైనది చంద్రబాబు గురించి. ఆయన అన్న మాట ఏంటి అంటే చంద్రబాబు అన్న వ్యక్తి నథింగ్ అని. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నదే జగన్ అభిప్రాయంగా ఉంది. ఇదే మాటను ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు.

ఇక చంద్రబాబు నథింగ్ అయినా వారితోనే అసలైన ప్రమాదం అని కూడా అన్నారు. ఈనాడు,ఆంధ్ర్య జ్యోతి, టీవీ ఫైవ్ అన్న మీడియా సంస్థలతోనే అతి పెద్ద ముప్పు ఉందని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. ఈ మూడు మీడియా సంస్థలు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా రాసి జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయని, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలకు జగన్ దిశా నిర్దేశం చేశారు.

మొత్తానికి చూస్తే టీడీపీ అనుకూల మీడియాతోనే మన యుద్ధం తప్ప చంద్రబాబుతో కానే కాదని జగన్ చెప్పినట్లు అయింది. ఆ మాటకు సరే అనుకున్నా  ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నథింగ్ అన్నదే కాస్తా వింతగా ఉందన్న మాట వినవస్తోంది.

చంద్రబాబు ఎంత మీడియా బేబీ అనుకున్నా ఆయనలో సంథింగ్ లేకపోతే మీడియా ఎందుకు ఆయన్ని హైప్ చేసి ఫోకస్ లో ఉంచుతుంది అన్నది కూడా లాజిక్ పాయింటే కదా. ఇక పాతికేళ్ళుగా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటూ ముమ్మారు పద్నాలుగేళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నాయకుడు.

ఆయనను అంతా అపర చాణక్యుడు అంటారు. కొన్ని సార్లు పారకపోయినా ఆ బుర్ర అయితే పాదరసం అని అంటారు. అలాంటి బాబును నథింగ్ అనుకోవడం అంటే అతి ధీమాతో ముందుకు పోవడమే అన్న మాట అయితే వస్తోంది. చంద్రబాబు నీటిలో మొసలి లాంటి వారు. ఆయన బలాన్ని ఎవరూ ఎపుడూ తక్కువ అంచనా వేయడం కూడా ప్రమాదమే అంటున్నారు.

దానికి జగన్ కి కళ్ళెదుట ఉన్న అనుభవం 2014 ఎన్నికలుగా అని అంటారు. అప్పట్లో అంటే పోలింగ్ కి పదిహేను రోజుల ముందు వరకూ జగనే సీఎం అన్న మాట ఉంది. జగన్ వేవ్ ఆ రేంజిలో ఉండేది. ఒక్కసారిగా ఆ సీన్ ని మార్చేసి తనకు అనుకూలంగా చేసుకుని సీఎం అయిన ఘనత కచ్చితంగా నాడు చంద్రబాబుదే.

మరి పొత్తుల ఎత్తులు వేశారా. లేక తన ప్రసంగాలను మార్చి జనాలను ఆకట్టుకున్నారా ఇలా ఏ విధంగా చెప్పుకున్నా విజేతగా మాత్రం నాడు బాబు నిలిచారు. అలాంటి బాబుని నథింగ్ అనుకుని ముందుకు సాగితే వైసీపీకి  ఎంతటి బలం ఉన్నా కూడా బాబు వ్యూహాల ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న మాట ఉంది. టీడీపీ అనుకూల మీడియా వైసీపీ సర్కార్ మీద నెగివిట్ గా రాస్తే పోరాడడంలో తప్పు లేదు కానీ ఏకంగా సీనియర్ మోస్ట్ అపోజిషన్ లీడర్  మాకు ఏమీ కారు అనుకుని యుద్ధానికి రిలాక్స్ గా వెళ్తే మాత్రం వైసీపీ వ్యూహం ఎక్కడతో తేడా కొట్టినట్లే అంటున్నారు.
Tags:    

Similar News