ఈటలను నమ్ముకొని వచ్చిన వాళ్ల గతేంటి?

Update: 2022-03-13 15:30 GMT
టీఆర్ఎస్ ను ఎదురించి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్  పరిస్థితి ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా అయ్యిందా? ఆయనను నమ్ముకొని వచ్చిన క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. నమ్మిన నేత వెన్నంటే నిలిచిన వారి విషయంలో ఇప్పుడు ఈటల సైలెంట్ అయ్యారు.  చేర్చుకున్న బీజేపీ పట్టించుకోవడం లేదు.

మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈయన టీఆర్ఎస్ ను ఎదురించి కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఎలాగోలా గెలిచినా ఇప్పుడు ఆయనను నమ్ముకొని కాషాయ కండువా కప్పుకున్న నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైందన్న ప్రచారం సాగుతోంది.

బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదని ఆయనతో వచ్చిన నేతలంతా మనోవేదనకు గురవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈటల వెనుకాల వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమా, ఆర్టీసీ యూనియన్ నేత అశ్వథామరెడ్డి తదితరులు ఉన్నారు. ఈటల గెలుపుకోసం వారంతా హుజూరాబాద్ లో కష్టపడి పనిచేశారు.

ఈటల రాజేందర్ ను నమ్ముకొని ఆయనతోపాటు చేరిన ఆ నేతలకు ఇప్పటివరకూ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఎలా ముందుకు వెళ్లాలో అర్తం కాక నమ్ముకున్న నేతను ఫాలో అవుతున్నారు. ఇక ఈటల రాజేందర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు ఇంకా సాధించలేకపోవడంతో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈటలను నమ్ముకున్న నేతలు ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పార్టీ గుర్తించి తమకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈటల వర్గీయులు చెబుతున్నారు.

ప్రత్యర్థి పార్టీలలో బలమైన నేతలను బీజేపీ వైపు తిప్పడానికి ఈటల సిద్ధంగా ఉన్నా రాష్ట్ర పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ ను ఎదురించి మరీ బలమైన కేసీఆర్ ను ఢీకొన్న ఈటల రాజేందర్ తన ప్రభావాన్ని ఎలా పెంచుకుంటారన్నది వేచిచూడాలి.  


Tags:    

Similar News