పవన్ కన్ను అక్కడ...రికార్డు బద్ధలే...?

Update: 2022-03-31 08:30 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారు. ఆయన 2019 ఎన్నికల వేళ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం తేడా రాకుండా రెండేళ్ల ముంచు నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఈసారి ఒక్క చోటే పోటీ చేయాలని, అది కూడా సంచలన విజయం నమోదు చేయాలని జనసేనాని ఆరాటపడుతున్నట్లుగా చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఈసారి తూర్పు గోదావరి జిల్లా నుంచే బరిలోకి దిగుతారు అంటున్నారు. పవన్ పోటీ చేయడానికి కొన్ని సీట్లను పరిశీలిస్తున్నాట్లుగా ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాకినాడ రూరల్, పెఠాపురం, రాజమండ్రీ రూరల్ నుంచి పోటీ చేయడానికి పవన్ ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ మూడు సీట్లలో కాకినాడ రూరల్, పిఠాపురం సీట్లలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక ఇక్కడ 2019 ఎన్నికల్లో జనసేనకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి.

దాంతో పాటు రాజమండ్రీ రూరల్ సీటులో కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఈ మూడు సీట్లలో ఒకదాన్ని పవన్ ఎంచుకుంటే కచ్చితంగా వార్ వన్ సైడ్ అవుతుంది. గెలుపు లాంచనం, ఇక మెజారిటీ కూడా అదిరిపోయే విధంగా ఉంటుంది. కానీ పవన్ ఈ మూడింటితో పాటు మరో సీటు మీద కూడా కన్ను వేశారు అంటున్నారు. ఆ సీటే కాకినాడ సిటీ.

ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పలు మార్లు ఇక్కడ నుంచి గెలిచి తన స్థావరంగా మార్చుకున్నారు ఇక కాకినాడ సిటీలో కాపులు పెద్ద ఎత్తున ఉన్నా కూడా 1955లో ఒక్కసారి తప్ప కాపులు ఎపుడూ గెలిచినది లేదు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పల్లం రాజు తాత  మల్లిపూడి పల్లం రాజు 1955లో ఒకసారి మాత్రమే  గెలిచారు అలాంటి సీట్లో కాపులు గెలవడం అంటే సెంటిమెంట్ ని మార్చడమే. చరిత్రను తిరగరయాడమే.

ఇక కాకినాడ సిటీలో మొత్తం జనాభా చూసుకుంటే  2 లక్షల 55 వేల 716 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు సామాజికవర్గం ఓటర్లు 28.6 శాతంగా చెబుతున్నారు. ఇక ఎవరు గెలవాలి అన్నా కూడా కాపుల ఓట్లే కీలకం. అయినా సరే కాపులు ఇక్కడ నుంచి పోటీకి దిగితే ఓడిపోతున్నారు. మరి కారణం ఏంటో తెలియదు. ఆ సంగతి తెలిసే కాపులకు కాకుండా ఇతర సామాజిక వర్గాలకే ఇక్కడ టికెట్లు అన్ని పార్టీలు ఇస్తున్నాయి.

ఇదీ కాకినాడ సిటీ కధ. మరి అలాంటి సీట్లో పవన్ పోటీ చేసి ద్వారంపూడిని చాలెంజ్ చేస్తారు అని వినిపిస్తోంది. మరి పవన్ కనుక పోటీ చేసి గెలిస్తే రికార్డు క్రియేట్ చేసినట్లే అవుతుంది. దాదాపు డెబ్బై ఏళ్ల తరువాత కాపులకు మళ్లీ కాకినాడ సిటీలో గెలుపు బావుటా అందించినట్లు అవుతుంది.

మరి పవన్ యాంటీ సెంటిమెంట్ ని చూసి వెనక్కి తగ్గుతారా. లేక తాను వైసీపీలో గట్టిగా టార్గెట్ చేస్తున్న ద్వారంపూడికి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తారా అన్నది చూడాలి. నిజానికి పవన్ ఆలోచనలు చూస్తే ద్వారంపూడిని ఢీ కొట్టే మొనగాడు తానే కావాలని అనిపిస్తోంది అంటున్నారు. మరో వైపు చూస్తే ద్వారంపూడి కూడా పవన్ తనతో పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. కాకినాడ సిటీలో కానీ తూర్పు గోదావరి జిల్లాలో కానీ పవన్ ఎక్కడ పోటీ చేసినా తానే దగ్గరుండి మరీ ఓడించి తీరుతాను అని ద్వారంపూడి సవాల్ చేస్తున్నారు.

దీంతో పవన్ లో పంతాన్ని ఆయన పెంచుతున్నారనే చెప్పాలి. మరి ఈ ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, చాలెంజిలు చేసుకుంటున్నారు. దాంతో పోటీ అంటూ జరిగితే కాకినాడ సిటీలోనే జరగాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి నిజంగా పవన్ కాకినాడ సిటీలో పోటీకి వస్తే ఏపీలో 2024 ఎన్నికల్లో ఆసక్తి గొలిపే సీటు ఇదే అవుతుంది అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News