సీఎం కేసీఆర్ కు ఆ ఎమ్మెల్యే రూ.100 కోట్లు ఇచ్చారట!

Update: 2022-03-14 12:30 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన ఎంట్రీ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే కూడా ఘాటుగా మాట్లాడేవారుంటారన్న విషయం అర్థమైంది. రాజకీయాల్లో మర్యాద అన్న పదం మిస్ అయి చాలా కాలమే అయ్యిందన్న సంగతి తెలిసిందే. నువ్వు ఒకటంటే.. నేను నాలుగు అంటాననే పరిస్థితి. నిజానికి ఉద్యమ సమయంలో కానీ ఆ తర్వాత కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు.. ఆరోపణలు చేయటానికి జంకేవారు.

తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత టీఆర్ఎస్ ను పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాక కూడా ఆయన్ను మాట అనేందుకు వెనుకా ముందు ఆడేవారు. అలాంటి సమయంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ కాస్త కాలు దువ్వేవారు. నోటికి పని చెప్పే వారు. కానీ.. హద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ.. బండి సంజయ్ మాత్రం బ్రేకుల్లేని బండి మాదిరి కేసీఆర్ అండ్ కో మీద తిట్ల ప్రవాహాన్ని కొనసాగించేవారు.

తనను టార్గెట్ చేసే వారి విషయంలో ఆయన తీరు ఇలానే ఉండేది. అలాంటి బండి సంజయ్ తాజాగా ఒక చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన అంశాల్ని వెల్లడించారు. ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ కు రూ.100 కోట్ల వరకు ఇచ్చారని.. అది కూడా మంత్రి పదవి కోసమన్నట్లుగా చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ సంచలనానికి తెర తీసేలా మారాయి. ఇంతకూ ఆయనేం చెప్పారు? అన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

"ప్రధాని మోదీ అవినీతికి దూరం ఉంటారు. ఎవరు అవినీతికి పాల్పడినా ప్రత్యేక దృష్టి పెడతారు. ఇక్కడ వేరు. అవినీతికి పాల్పడేవారిని కేసీఆర్‌ ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వారిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. ఓసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసి.. నా దగ్గర వంద కోట్లు తీసుకున్నాడన్నా అని చెప్పాడు. సదరు ఎమ్మెల్యేకు హిందూత్వ భావజాలం ఎక్కువని, పార్టీ నుంచి బయటకు పోతాడేమోనని డబ్బు తీసుకున్నాడట" అని చెప్పారు. దీనికి ప్రతిగా మరో ప్రశ్నను బండికి సంధిస్తూ.. "రూ.100 కోట్లు ఇచ్చి కేసీఆర్ పార్టీలో ఉండాల్సిన ఖర్మేమిటి? అంటే.. దానికి బండి సంజయ్ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది.

"అదే ఆయనది రాజకీయ చతురత. ఆ డబ్బు మళ్లీ అడుగుతడని.. ఫస్ట్‌ ఓ మంత్రినో ఇంకెవర్నో ఆ ఎమ్మెల్యే దగ్గరకు కేసీఆర్‌ పంపిస్తడు. 'నీ గురించే మాట్లాడుతుండన్నా.. నువ్వు అంత దగ్గరనా అన్నా ఆయనకు?' అని ఆ వ్యక్తితో చెప్పిస్తడు. ఆ ఎమ్మెల్యేమో.. కేసీఆర్‌ దృష్టిలో పడ్డానంటే నెక్స్ట్‌ మంత్రినైత కావొచ్చు అని ఐస్‌ అయిపోతడు. డబ్బులడిగే సమయానికి ఎవరో వ్యక్తి ద్వారా బ్రేక్‌ ఫాస్ట్‌కు పిలుస్తాడట. ముఖ్యమంత్రి గారితో బ్రేక్‌ ఫాస్ట్‌ అని ఐస్‌ అయిపోతడు.

మరో ఆర్నెల్ల తర్వాత కేటీఆరో వాళ్ల కుటుంబసభ్యులెవరైనా ఆ ఎమ్మెల్యేను కలిసి.. 'ఏమైంది.. మా నాన్నగారు నా కన్నా ఎక్కువ నిన్నే కలవరిస్తున్నాడు' అని చెప్పేసరికి మరో ఆర్నెల్ల దాకా డబ్బులు అడగడు. ఇదంతా నాకు ఓ ఎమ్మెల్యే చెప్పిన విషయం. తెలంగాణ ధనిక రాష్ట్రం అనుకున్నాం గానీ మంత్రి పదవికి రూ.100కోట్లు ఇస్తున్నారంటే వ్యక్తులు కూడా ఇంత ధనికులు అనుకోలేదు.టీఆర్‌ఎస్‌ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఎక్కువ కాదు. అంత డబ్బు వారికి సింపుల్‌" అంటూ చెప్పారు. బండి చెప్పిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనికి సీఎం కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కానీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News