మజ్లిస్ కార్పొరేట్.. ఆ మాత్రం మామూలేగా?

Update: 2022-04-06 02:59 GMT
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అంటూ సినిమాల్లో డైలాగులు మామూలే. పబ్లిక్ గా పోలీసుల ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ.. ఈ తరహా ధమ్కీ ఇవ్వటం మాత్రం అందరికి సాధ్యమయ్యే పని కాదు. చిన్న చిన్న కారణాలకే ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించే తెలంగాణ రాష్ట్ర పోలీసులు.. మజ్లిస్ కార్పొరేటర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. నోటికి వచ్చినట్లుగా పోలీసులతో మాట్లాడిన వేళలో ఏమీ చేయలేని తీరు చూస్తే.. ఇదెక్కడి ఆరాచకం బాబు అనుకోకుండా ఉండలేం. వందలాది మంది ముందు పబ్లిక్ గా పోలీసులపైనే బెదిరింపులకు దిగిన కార్పొరేటర్ తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అతగాడి హడావుడి ముందు పోలీసులు తగ్గక తప్పలేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

మజ్లిస్ కార్పొరేటర్ తీరును తప్పు పట్టిన మరో కానిస్టేబుల్ కు అయితే వంద రూపాయిల వాడివి.. నువ్వు మాట్లాడతావా? అంటూ ఓపెన్ గా దారుణ వ్యాఖ్య చేశారు. మామూలుగా ఇలాంటి సీనే మరెవరి విషయంలో జరిగినా.. వెంటనే పాటూన్ల బలగాలు దిగిపోయి.. సదరు నేతను.. వారి సంస్థానం మొత్తాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించేస్తుంటారు.

అందుకు భిన్నంగా హైదరాబాద్ పోలీసులు మాత్రం కామ్ గా ఉండటం గమనార్హం. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుంది? ఎందుకు చోటు చేసుకుంది? పోలీసుల చేసిందేమిటి? మజ్లిస్ కార్పొరేటర్ అంతలా ఎందుకు చెలరేగిపోయారు? లాంటి విషయాల్లోకి వెళితే..
 
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఒక డివిజన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లిస్ కార్పొరేటర్ ఒకరు తన అనుచరుల్ని పదుల సంఖ్యలో వెంట వేసుకొని తిరుగుతూ పోలీసుల మీద వీరంగం చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత పదుల సంఖ్యలో అనుచరుల్ని వేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆయన్ను పోలీసులు ప్రశ్నించారు.

దీనికి చెలరేగిపోయిన సదరు కార్పొరేటర్ వారిపై బిగ్గరగా అరుస్తూ దుర్భాషలాడారు. వారించబోయిన పోలీసుల్ని కించపరుస్తూ.. నువ్వు వంద రూపాయిల మనిషివి. నువ్వు కూడా మాట్లాడతావా? అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు.

రంజాన్ సందర్భంగా నెల రోజులు రాత్రంతా తమకు ఇష్టం వచ్చినట్లుగా నగరమంతా తిరుగుతామని.. నగరంలో ఎక్కడైనా సరే తాము తినే పదార్థాలు ఉండాలంటూ చేసిన కార్పొరేటర్ వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. పోలీసులపై ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన కార్పొరేటర్ పై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవటం ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News