మోడీ ఇక జ‌మిలి ఎన్నిక‌ల‌కు సై అంటారా?

Update: 2022-03-10 08:30 GMT
వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది.. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి దెబ్బ త‌ప్ప‌దు.. ఇవీ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ముందు విప‌క్షాల అంచ‌నాలు. కానీ వాటిని త‌ల‌కిందులు చేస్తూ బీజేపీ మ‌రోసారి స‌త్తాచాటింది. పంజాబ్ మిన‌హా నాలుగు రాష్ట్రాల్లోనూ విజ‌యం సాధించి అధికారంలో చేప‌ట్టడం ఖాయ‌మైంది. అందులో కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ గెలిచిన బీజేపీ మ‌రింత జోష్‌లో ఉంది. ఈ జోరులోనే ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్రం దృష్టి సారించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక‌లు

ప్ర‌ధానిగా మోడీ రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒకే దేశం- ఒకే ఎన్నిక‌లు పేరుతో జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. అన్ని పార్టీల అధ్య‌క్షుల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా ఎదురైన ప‌రిస్థితుల కార‌ణంగా మ‌రో అడుగు ముందుకు ప‌డ‌లేదు. కానీ ఇప్పుడు అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు బీజేపీకి కొత్త హుషారును అందిస్తున్నాయి. దీంతో మ‌రోసారి జ‌మిలి ఎన్నిక‌ల‌పై మోడీ ఫోక‌స్ చేస్తార‌ని తెలిసింది.

మ‌రోవైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర కూడా తాము జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అందు కోసం పార్ల‌మెంట్‌లో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అయితే ప్ర‌స్తుతం పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే జూన్‌లో రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది.  ఈ నేప‌థ్యంలో ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

జ‌గ‌న్ ఏమంటారు..

2019లో ప్ర‌ధానితో జ‌రిగిన స‌మావేశంలో తాము జ‌మిలి ఎన్నిక‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అదే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటారా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రోవైపు ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌మ శ్రేణుల‌ను సిద్ధం చేస్తున్నారు. జ‌గ‌న్ కూడా పార్టీ నేత‌ల‌ను ఎన్నిక‌ల మూడ్‌లోకి తీసుకువ‌చ్చేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ రంగంలోకి దిగ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని టీడీపీ చెబుతోంది. కానీ జాతీయ స్థాయిలో చోటు చేసుకునే ప‌రిణామాల ఆధారంగానే జ‌మిలి ఎన్నిక‌ల‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్పుడు మ‌రో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి రాష్ట్రప‌తి ఎన్నిక‌ల ఎలక్ట్రోల్ కాలేజీలో ఆ పార్టీ ఓటు విలువ మ‌రింత పెరుగుతుంది.

దీంతో బీజేపీకి ఇత‌ర పార్టీల అవ‌స‌రం ప‌డ‌క‌పోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌ల విష‌యంలో బీజేపీ ఎలాంటి అడుగు వేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News