కొత్త జిల్లాలకు బిగ్ బ్రేక్ పడనుందా... ?

Update: 2022-03-13 07:30 GMT
ఏపీలో మరి కొద్ది రోజుల్లో అంటే ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని అంతా భావిస్తున్నారు. దానికి సంబంధించిన కసరత్తు చకచకా సాగుతోంది. కొత్త జిల్లాలకు భవనాలను ఎంపిక చేయడం నుంచి సీనియర్ అధికారులను అక్కడ నియమించడం వరకూ అంతా ఒక పద్ధతి ప్రకారం జోరుగా  జరిగిపోతోంది. ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే ఏప్రిల్ 2 అంటే ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో పాలన సాగుతుంది.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు అతి పెద్ద అడ్డంకి ఒకటి ఉందని అంటున్నారు. అదేంటి అంటే చాలా టెక్నికల్ మ్యాటర్. రాజ్యాంగబద్ధమైన వ్య‌వహారం. దాంతో దీని మీద హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి లేటెస్ట్ గా దాఖలు అయింది. కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు  రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 371డీకి పూర్తిగా వ్యతిరేకం అని అంటున్నారు.

ఈ పాయింట్ మీదనే గుంటూరుకి చెందిన దొంతినేని విజయకుమార్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన  బెజ్జి సిద్ధార్థ , ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇంతకీ వీరు చెబుతున్నది ఏంటి అంటే రాష్ట్రపతి ఉత్తర్వులుగా వచ్చిన 371డి ని మార్చితేనే తప్ప కొత్త జిల్లాల ఏర్పాటు సాధ్యపడదు అని.

రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు  371 డి అన్నది ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించినవి. వీటిని ఇప్పటికి నాలుగున్నర దశాబ్దాల క్రితం తీసుకువచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులుగా వీటిని పేర్కొంటారు. వీటిలో మార్పు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని రాజ్యాంగ మేధావులు అంటున్నారు. అది చాలా పెద్ద ప్రాసెస్.

మరి వైసీపీ సర్కార్ మాత్రం కొత్త జిల్లాలను జనవరి 25న నోటిఫికేషన్ ఇలా ఇస్తూనే అలా వాటికి సంబంధించిన యాక్షన్ అంతా దూకుడుగా చేస్తూ పోతోంది. మరి రాష్ట్రపతి ఉత్తర్వులు 371 డి అడ్డు వస్తుందని ప్రభుత్వ పెద్దలకు తెలియదా అన్నదే ఇక్కడ డౌట్.

ఇదిలా ఉంటే ఈ పిల్ ని హై కోర్టు స్వీకరించింది. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం  ఈ నెల 14న ఈ పిల్ మీద విచారణ జరపనుంది.

మరి రాజ్యాంగం ప్రకారం చూస్తే ఇబ్బందులు వస్తాయంటే దీని మీద ఎలా  తీర్పు వస్తుంది అన్నది ఉత్కంఠగానే ఉంది.  ఏది ఏమైనా కొత్త జిల్లాలకు ఎదురులేదనుకుంటున్న వేళ ఇలా పిల్ దాఖలు కావడంతో వైసీపీ సర్కార్ పెద్దలలో ఇపుడు సరికొత్త టెన్షన్ అయితే మొదలైందనే అంటున్నారు.



Tags:    

Similar News