పవన్ ప్రపోజల్... టీడీపీ సైలెంట్... ?

Update: 2022-03-17 06:25 GMT
ఏపీలో ఎవరెటూ అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అధికార వైసీపీకి మిత్రులు అంటూ రాజకీయాల్లో ఎవరూ లేరు. సింగిల్ గానే తాము అంటూ వైసీపీ ఎపుడూ చెబుతూ ఉంటుంది. దాంతో పొత్తుల అంశం అంటే విపక్షాల మధ్యనే నాచురల్ గా  చర్చలు ఉంటాయి. ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళకు పైగా వ్యవధి ఉండగానే జనసేనాని పొత్తుల గురించి కెలికి అన్ని పార్టీలో అదే హాట్ టాపిక్ అయ్యేలా చూశారు.

పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు అని అంటున్నారు. పవన్ కి రాజకీయాలు తెలియవు అని ఎవరైనా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే అన్నట్లుగానే ఆయన ప్రసంగం మొత్తం సాగింది. సభ జరిగి మూడు రోజులు గడచినా పవన్ స్పీచ్ లోని అర్ధాలకు తాత్పర్యాలు వెతకడంలో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియెన్స్ ఉన్న పార్టీలు కూడా తడబడుతున్నాయంటే పవన్ ఎలాంటి సందేశం పంపించారో అర్ధం చేసుకోవాల్సిందే.

నిజానికి అన్ని పార్టీలతో కలసి 2024 ఎన్నికలకు వెళ్తాం, వైసీపీని గద్దె దించుతాం అని పవన్ అంటే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం చెవిలో అది అమృతం లాంటి వార్త కావాలి. ఈపాటికి ఆ పార్టీ నేతలు ఎగిరి గంతేయాలి. కానీ టీడీపీ నుంచి మూడు రోజులు గడచిమా పవర్ ఫుల్ రియాక్షన్ అయితే రాలేదు అనే చెప్పాలి, సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప, వర్ల రమయ్య వంటి ఒకరిద్దరు మాత్రమే  దీని మీద స్పందించారు.  కానీ మిగిలిన వారు మాత్రం ఎందుకో మౌనాన్నే ఆశ్రయించారు.

నిజానికి పవన్ పొత్తులకు రెడీ అని ఇండైరెక్ట్ గా చెప్పిన మాట విని ఈపాటికి టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకోవాలి. కానీ సీన్ చూస్తే అలా లేకుండా పోయింది. మరి ఎందుకు ఈ తర్జనభర్జన. పవన్ పబ్లిక్ సాక్షిగా ఇచ్చిన అప్పీల్ మీద టీడీపీ ఎందుకు మల్లగుల్లాలు పడుతోంది అంటే అక్కడే ఉంది అసలైన  మతలబు.

జనసేన సభ ద్వారా పవన్ పొత్తుల విషయం చెప్పినప్పటికీ తాను కేంద్ర బిందువు అయ్యారు. అంతే కాదు ఏపీ భరోసా తాను తీసుకుంటాను అంటున్నారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమే అని చెబుతున్నారు. దాని కోసం రెండేళ్ల ముందే ఆయన ఎన్నికల మ్యానిఫేస్టో ప్రకటించారు. అలా విపక్షాలలో ఒక్కసారిగా పైచేయి సాధించేశారు.

పవన్ తొలిసారిగా ఈ అప్పీల్ చేసినందున సహజంగానే మిగిలిన వారు రియాక్ట్ కావాల్సి ఉంటుంది. అలా రియాక్ట్ అయితే పవన్ చెప్పిన ఫార్ములా ప్రకారం వారు భాగం అవుతారు కానీ పెద్దన్న పాత్ర అయితే దక్కేది ఉండదు. దీని మీద జనసేన నాయకులు అంటున్నది ఏంటంటే మేము ప్రతిపాదించాం, కాబట్టి లీడ్ తీసుకునే చాన్స్ కూడా మాకే ఉంటుందని.

సో పవన్ తెలివిగానే బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలకు అతి పెద్ద పరీక్ష పెట్టారు. తన అవసరం ఎవరికి ఉందో వారు రావచ్చు అని కూడా ఆయన ఇండైరెక్ట్ అప్పీల్ చేసినట్లు అయింది. మరి పవన్ తో అవసరం ఉంది అనుకుంటే సీట్ల రాయబేరాలకు కూడా తగ్గి ఉండాలి. బహుశా ఇలాంటి విషయాల మీద సీరియస్ గా డిస్కషన్ జరుగుతున్న నేపధ్యంలోనే టీడీపీలోని పెద్దలు పవన్ యాంటీ జగన్ కూటమి మీద పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే  పవన్ ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ప్రయోగించిన అతి పెద్ద రాజకీయ  అస్త్రం ఇదే అని అంతా అంటున్నారు. బలమైన పార్టీలు సైతం మాట్లాడలేక సైలెంట్ అవుతున్నాయీ అంటే పవన్ కంటే వ్యూహకర్త మరొకరు ఉంటారా.
Tags:    

Similar News