పవన్ సీఎం అయితే చాలు...?

Update: 2022-03-23 12:33 GMT
జనసైనికులు అంటే పవన్ కి మరొ రూపం అనే చెప్పాలి. వారంతా పవన్ని తమలో చూసుకుంటారు. పవన్ కి ఆయనలాగానే కనిపిస్తారు. పవన్ మ్యానరిజం, ఆయన డైలాగులు, ఆయన ఫిలాసఫీ అంతా జనసైనికులకు కంఠోపాఠం. ప్రస్తుతం జనసైనికులు మంచి జోష్ లో ఉన్నారు. గుంటూరు జిల్లాలో రీసెంట్ గా జరిగిన జనసేన ఆవిర్భావ సభ సూపర్ హిట్ కావడం, పవన్ గంటన్నర పాటు గుక్క తిప్పుకోకుండా స్పీచ్ ఇవ్వడం, ఆ స్పీచ్ లో వచ్చేది మన ప్రభుత్వమే అని పక్కాగా క్లారిటీ ఇవ్వడంతో నాటి నుంచి వారంతా నేల మీద నడవడంలేదు.

రెండేళ్ళు ఆగండి వచ్చేది మన సర్కారే అని జనసైనికులు గట్టిగానే జనాలకు చెబుతున్నారు. అంతే కాదు, తమ పార్టీకే ఓటు వేయాలని కూడా వారు అపుడే ప్రచారంలోకి దిగిపోతున్నారు. ఇప్పటిదాకా టీడీపీ, వైసీపీ పాలనను చూశారు, ఇక జనసేనకు కూడా ఒక్క చాన్స్ ఇవ్వండి అని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తేనే ఏపీ బాగుపడుతుంది అని కూడా వారు అంటున్నారు.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చకుండా అన్ని పార్టీలను ఏకం చేస్తామని పవన్ చెప్పడాన్ని కూడా వారు గట్టిగానే సమర్ధిస్తున్నారు. పార్టీలు చీలిపోయి విడిగా పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ వచ్చే ప్రమాదం ఉందని అందుకే తమ నాయకుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని అంటున్నారు.

ఇక జనసైనికుల మనోగతం ఎలా ఉంది అంటే పొత్తులు ఎత్తులు అన్నవి తమకు అనవసరం, రాజకీయాలలో అలాంటివి ఉంటాయి. కానీ పవన్ ఎవరితో పొత్తు పెట్టుకునన కూడా ముఖ్యమంత్రి మాత్రం ఆయన కావాల్సిందే అని అంటున్నారు. పవన్ సీఎం గా ఒప్పుకున్న వారితోనే పొత్తులు పెట్టుకోవాలని కోరుతున్నారు.

పవన్ కళ్యాణ్ 2014లో రాజకీయాల్లోకి వచ్చినా నాడు ఏ పదవీ కోరుకోలేదని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వారి ఆకాంక్షలు  ఎలా ఉన్నాయీ  అంటే వైసీపీని దించే సత్తా తమకే ఉందని, అందువల్ల పవన్ కి విపక్షాలు  అన్నీ కలసి మద్దతుగా నిలవాలని, పవన్ని సీఎం చేయాలన్నవే.

మరి జనసేనాని అభిప్రాయం కూడా ఇదేనా. ఆయన ప్రజా ప్రభుత్వం అన్నారు. అంటే అది జనసేన లీడ్ చేసేదేనా. లేక టీడీపీ లీడ్ చేసే సర్కార్ లో జనసేన భాగం అవుతుందా.  ఇవన్నీ ప్రశ్నలు. సందేహాలు. కానీ జనసేన అభిమానులు, కార్యకర్తలకు మాత్రం ఇవేమీ అవసరం లేదుట. పవన్ సీం అయితే చాలు అంటున్నారు. మొత్తానికి అభిమానులు పెద్ద పంతమే పట్టేసారు. అధినాయకుడు దాన్ని తీర్చాల్సి ఉంది మరి.
Tags:    

Similar News