మీరే నేను... నేనే మీరు....?

Update: 2022-02-06 14:00 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మొత్తానికి ఉద్యోగులను ప్రసన్నం చేసుకున్నారు. వారి వద్ద నుంచి మనసారా  ప్రశంసలు అందుకున్నారు. మీరే మీరే మా సారూ అనిపించుకున్నారు.  మూడు రోజుల క్రితమే  విజయవాడ ఆందోళనలో ఆగ్రావేశాలతో ముఖ్యమంత్రి మీద హాట్ హాట్ కామెంట్స్ తో కొందరు ఉద్యోగ సంఘ నేతలు చెలరేగిపోయారు. దాన్ని చూసిన వారికి కేవలం 72 గంటల వ్యవధిలో మా మంచి సీఎం జగన్ అని ఉద్యోగుల  నోటి వెంట వస్తుంది అని అసలు అనుకోరు.

కానీ సీన్ కట్ చేస్తే ఉద్యోగులు ఇపుడు జగన్ సార్ చాలా మంచోరు అంటున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా జగన్ మేము చెప్పిన వాటిని అన్నీ ఒప్పేసుకున్నారు. నిజంగా జగన్    మనసే వెన్న అంటున్నారు. మరో వైపు చూస్తే ధన్యవాదాలు చెప్పుకోవడానికి  ఉద్యోగులు జగన్ని తాజాగా కలిశారు. తమకు పీయార్సీలో కొత్త సవరణలు అన్నీ చేసి తాము కోరుకున్న విధంగా డిమాండ్లు ఒప్పుకున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలతో జగన్ అన్న మాటలతో వారంతా ఫిదా అయ్యారుట. మీరు లేకపోతే నేను లేను, ఈ ప్రభుత్వమే లేదు, మీరే నేను, నేనే మీరు అంటూ జగన్ ఎమోషనల్ గా చెప్పిన మాటలతో సంఘ నేతలు అయితే ఫుల్ హ్యాపీ అయ్యారుట. అదే విధంగా ఈ ప్రభుత్వం మీదే అంటూ జగన్ వారితో అనడమూ విశేషంగానే చూడాలి.

మీరు ఏ సమయంలోనూ భావోద్వేగాలకు గురి కావద్దు, మీకు ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా ప్రభుత్వంతో చెప్పుకోండి అంటూ జగన్ వారికి ఫుల్ గా  వెసులుబాటు ఇచ్చేశారు. నేను మీకు ఇవ్వగలినంతగా ఇచ్చాను, ఇంకా ఇవ్వాలనే నాకు ఉంది. అయితే కరోనా సంక్షోభంతో పాటు, ఆర్ధికంగా ఇబ్బందుల వల్లనే ఇవ్వలేకపోతున్నాను అని జగన్ చెప్పడం గమనార్హం.

ఇప్పటికి ఇంత దాకా చేశాను, భవిష్యత్తులో అవకాశం వస్తే జగన్ కంటే ఏ సీఎం ఉద్యోగులకు చేయలేడు అనిపించేటంతగా చేస్తానని జగన్ మరో భారీ హామీ ఇచ్చేశారుట. ఇపుడు అదే ఉద్యోగులలో పెద్ద ఎత్తున చర్చగా సాగుతోంది. అంటే రేపటి రోజున ఏదో విధంగా జగన్ ఇంతకన్నా ఎక్కువ  బెనిఫిట్స్ ఇవ్వాలని భావిస్తున్నారని ఉద్యోగులలో చర్చ అయితే  సాగుతోందిట.

ఇక సీపీఎస్ రద్దు విషయంలో కూడా జగన్ వారికి తాను మంచి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం కూడా చర్చగా ఉందని అంటున్నారు. ప్రభుత్వం మీతో ఉంటుంది, మీరు కూడా ప్రభుత్వంలో భాగం, మీరు లేకుండా ఒక్క ప్రభుత్వ కార్యక్రమం కూడా జరగ‌దు అంటూ జగన్ అన్న మాటలతో ఉద్యోగ సంఘ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారుట. చూడాలి మరి ఈ బంధం ఇంకెంతలా గట్టి పడుతుందో.



    
    
    

Tags:    

Similar News