పుష్ప శ్రీవాణికి సొంత ఆడపడుచు షాక్.... ?

Update: 2022-03-15 04:47 GMT
రాజకీయాలు అంటే ఇవే మరి. రాజకీయం ఎపుడూ కూడా ఇంటి బయట ఉంచాలనుకున్నా కుదిరేది కాదు, అది ఇంట్లోకి వంటిలోని కూడా వస్తుంది. ఇది అందరికీ తెలిసిన కధే. వేరు వేరు రాజకీయ పార్టీలు ఒకే కుటుంబంలో ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇపుడు అలాంటిదే మరోటి చోటు చేసుకోబోతోంది.

విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి సొంత ఇంటి నుంచే గట్టి షాక్ ఎదురుకాబోతోంది. ఆమె సొంత ఆడపడుచు పల్లవీరాజు టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన కూడా చేశారు. ఈ నెల 16న తాను టీడీపీ తీర్ధం తీసుకుంటాను అని చెప్పేశారు.

ఆమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే, పుష్ప శ్రీవాణి సొంత మామ అయిన శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమార్తె. అదే విధంగా పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజు చెల్లెలు కూడా. అంటే అటు వదినా, ఇటు మరదలు ఎదురుగా నిలబడి రేపటి ఎన్నికలలో రాజకీయ సమరం సాగిస్తారు అన్న మాట.

ఇక కురుపాం రాజకీయాల్లో చూసుకుంటే 2014, 2019 ఎన్నికల్లో రెండు మార్లు శ్రీవాణి గెలిచి తన పట్టుని నిలుపుకున్నారు. అంతే కాదు, ఆమె ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఆమె పెద మామ శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్ లో ఉంటూ మంత్రిగా పనిచేసిన వారు. వైఎస్సార్ కి ఇష్టుడుగా మెలిగిన వారు. ఆయన మరణానంతరం ఏపీ విభజన తరువాత ఆయన టీడీపీలో చేరిపోయారు.

ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక  మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు కూడా వైసీపీకి దూరంగా జరిగి చాలాకాలం అయింది. ఆయన గతంలో నాగూరు నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచిన వారు. ఆయన ఒకసారి టీడీపీలో చేరి మళ్ళీ వైసీపీకి జై కొట్టి ఇపుడు టీడీపీ వైపుగా జరిగారు. ఆయన కుమార్తె పల్లవీరాజుకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం గట్టిగానే  ప్రయత్నం చేస్తున్నారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట.

ఇపుడు దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో కురుపాం నుంచి టీడీపీ తరఫున పల్లవీరాజు సొంత వదిన మీద పోటీ చేస్తారు అని అర్ధమైపోతోంది. ఇదిలా ఉండగా మొత్తం శత్రుచర్ల కుటుంబంలో పుష్ప శ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజు ఒంటరి అయ్యారా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి రెండు సార్లు కురుపాంని గెలుచుకున్న శ్రీవాణి 2024లో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంటారా లేదా  అన్నది చూడాలంటే ఇంకా చాలా సమయం ఉంది మరి.
Tags:    

Similar News