వ‌ర్షాలు ఇప్పుడు లేవు... రోడ్లు వేయండి సార్‌!

Update: 2022-03-16 05:17 GMT
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. "వ‌ర్షాలు లేవు సార్‌.. రోడ్లు వేయండి!" అని ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితి మామూలుగా లేదు. ఎటు మూల‌కు వెళ్లినా.. ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. మోకాల్లోతు గుంత‌ల‌తో రోడ్లు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రి వీటిని ఎప్పుడు వేస్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి.. మూడేళ్లు అవుతోంది. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టుమ‌ని.. ప‌ది కిలోమీట‌ర్ల మేర కూడా ర‌హ‌దారిని నిర్మించేలేక పోయారు.

ఎక్క‌డైనా అవ‌స‌రం అయితే.. గుంత‌లను పూడ్చుతున్నారే త‌ప్ప‌.. పూర్తిస్థాయిలో ఎక్క‌డా ప‌నిచేయ‌డం లేదు. అదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. త‌ప్పంతా చంద్ర‌బాబుదేన‌ని.. ఆయ‌న వేసిన రోడ్లు ఇలానే ఉన్నాయి. అంతా అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి ఉవ‌చించారు. గ‌త ఏడాది అక్టోబ‌రు 2న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ర‌హ‌దారుల దుస్థితిపై.. ఆందోళ‌న వ్య‌క్తంచేసి.. శ్ర‌మ‌దానం పేరుతో గుంత‌ల‌ను పూడ్చే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. ఈ స‌మ‌యంలో వెంట‌నే రియాక్ట్ అయిన ప్ర‌భుత్వం గుంత‌లు పూడ్చే ప్ర‌య‌త్నం మాత్రం చేసింది.

ఇక‌, ఎవ‌రైనా..ఎక్క‌డైనా రోడ్లు నిర్మించండి మ‌హాప్ర‌భ అంటే.. మంత్రుల నుంచి నేత‌ల వ‌ర‌కు అంద‌రూ కూడా చంద్ర‌బాబును ఆడిపోశుకునేందుకు మాత్ర‌మే ప్రాధాన్యం ఇస్తున్నారు.

త‌ప్పంతా చంద్ర‌బాబుదేన ని..  అంటున్నారు. నిజ‌మే.. చంద్ర‌బాబుదే త‌ప్పు.. అని క‌దా.. ప్ర‌జ‌లు మీకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.. అంటు న్నారు.. ప్ర‌జ‌లు. 151 సీట్లు ఇచ్చింది అందుకే క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  ఆ విష‌యం మ‌రిచిపోయి.. ఇంకా చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం.. ఆయ‌న‌ను ప్ర‌స్తావించ‌డం అవ‌స‌ర‌మా? అనేది ప్ర‌జ‌ల మాట‌.  

నిజానికి గ‌త ఏడాది అక్టోబ‌రు, న‌వంబ‌రు మాసాల మ‌ధ్య రాష్ట్ర వ్యాప్తంగా ర‌హ‌దారుల దుస్థితిపై.. చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం వీటి కోసం రూ.2800 కోట్లు విడుద‌ల చేశామ‌ని.. చెప్పుకొంది. కొన్ని చోట్ల కాంట్రాక్ట‌ర్లు ప‌ని కూడా చేస్తున్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి... ప్ర‌స్తుతం సీమ‌లోని నాలుగు జిల్లాల్లోనూ ప‌నులు ప్రారంభిస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఇప్పుడు ఇక్క‌డ వ‌ర్షాలు ఉండ‌వు. సో.. ఇక్క‌డ ప‌నులు ప్రారంభిస్తే.. ఇబ్బందిలేకుండా పూర్త‌వుతాయి.

అదేస‌మ‌యంలో ఇప్పుడు కోస్తా, ఉత్త‌రాంధ్ర ప్రాంతాల్లో వ‌ర్షాలుకురుస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అక్క‌డ రోడ్లు వేసినా.. ప్ర‌యోజ‌నం లేదు. వ‌ర్షాలు త‌గ్గిన వెంట‌నే రోడ్లు వేసే బాధ్య‌త మాదే! అని నొక్కి వ‌క్కాణించారు.. అయితే.. వ‌ర్షాలు పోయాయి.. శీతాకాలం కూడా వెళ్లిపోయింది.. ఇప్పుడు వేసవి కాలం వ‌చ్చేసింది. అయినా.. ఎక్క‌డా ర‌హ‌దారుల ఊసు ఎత్త‌క పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News