ప్రపంచ కోర్టు మాటకి లెక్క లేదు.. ఇంక ఎవరి మాట వింటారు?

Update: 2022-03-18 08:31 GMT
తమ దేశ భద్రతకు ముప్పు ఉందని అంటూ ఉక్రెయిన్‌ పై రష్యా తలపెట్టిన సైనిక దాడులు ప్రస్తుతం యుద్ధం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సైనిక దాడులు యుద్ధం గా మారాయి అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. రష్యా మాత్రం ఇది యుద్ధం కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.  ఈ సైనిక దాడులు తమ దేశ రక్షణ కోసం చేస్తున్న సైనిక దాడి అని చెప్పుకుంటున్నారు.

రష్యా సైన్యం సాగిస్తున్న మారణకాండ పై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య ప్రజల పై రష్యా యుద్ధ విమానాలు బాంబులను జారవిడుస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో ఎక్కడ చూసినా కూడా శిథిలావస్థలో ఉన్న భవనాలు కనిపించడంతో పాటు లక్షల మంది విదేశాలకు వెళ్లి తల దాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే భారీ ఎత్తున ఉక్రెయిన్‌ వాసులు విదేశాలకు వలస వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేక పోలేదు. తాజాగా ప్రపంచ కోర్టు ముందుకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌ స్కీ రష్యా అధ్యక్షుడి మారణ హోమం ను తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ప్రపంచ కోర్టు వెంటనే రష్యా సాగిస్తున్న మారణకాండను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రపంచ కోర్టు ఆదేశాలను రష్యా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కి సంబంధించిన అధికారులు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తమ దేశ భద్రత ముఖ్యం అంటూ రష్యా అధ్యక్షుడు మారణ హోం ను సాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు ఉక్రెయిన్‌ సైన్యం కూడా తాము తక్కువేం కాదు అన్నట్లుగా రష్యా సైనికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు.

ఇప్పటికే వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్‌ సైన్యం మరియు సామాన్యులు మట్టుబెట్టారు అంటూ సమాచారం అందుతోంది. అధికారికంగా 500 మంది తమ సైనికులు మృతి చెందారు అంటూ ఇటీవల రష్యా ప్రకటించింది.

కానీ ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ మీడియా వర్గాల వారు చెప్తున్నారు. ఉక్రెయిన్‌ సైన్యం తో సామాన్యులు కూడా జత కలవడంతో రష్యా ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.
Tags:    

Similar News