శ్రీ‌కాకుళం : ప్ర‌శాంత సీమ‌ల్లో హ‌త్య‌లు హ‌త్యా రాజ‌కీయాలు

Update: 2022-03-28 04:52 GMT
తుపాకులు ఎక్క‌డి నుంచో వ‌స్తున్నాయి. ఆన్లైన్ లో ఆయుధాలు హాయిగా అందుబాటులో ఉంటున్నాయి. ఫోన్ క‌ల్చ‌ర్  తీవ్ర నేరాల‌కు దారి ఇస్తోంది. ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంద‌న్న న‌మ్మ‌కం మ‌రియు ఏం చేసినా అడిగేవారు ఎవ‌రులే అన్న నిర్ల‌క్ష్యం రెండూ యువ‌త‌ను పెడ‌దోవ‌లో న‌డిపిస్తున్నాయి.ఇవే ఇప్పుడు శ్రీ‌కాకుళం పోలీసుకే కాదు యావ‌త్ ఆంధ్రా పోలీసుకూ స‌వాలుగా ప‌రిణ‌మిస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీ చ‌దువులు మ‌ధ్యలో ఆపేయ్య‌డం, చెడు తిరుగుళ్ల‌కు అల‌వాటు ప‌డిపోవడం, ఆన్లైన్ గేమ్ క‌ల్చ‌ర్ ఓ పెద్ద వ్య‌స‌నంలా మారిపోవడం ఇవ‌న్నీ ప్ర‌మాద‌క‌ర శ‌క్తులుగానే ఉన్నాయి. వీటిని దాటి రావ‌డం అస్స‌లు జ‌ర‌గ‌ని పని అన్న విధంగానే ఓ విష సంస్కృతి యువ‌త‌ను శాసిస్తోంది. అందులో భాగంగా నీతి నియ‌మాలు అన్న‌వి ప‌ట్టింపులో లేవు. పాటింపులోనూ లేవు.

గ‌న్ క‌ల్చ‌ర్ , గంజాయి వాడ‌కం అన్న‌వి ఇప్పుడు శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఎన్న‌డూ లేని విధంగా వ‌రుస హ‌త్య‌లు పోలీసుల‌కు కంటి  మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేరాల నియంత్ర‌ణ‌కు ఎక్క‌డిక‌క్క‌డ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ ఫలితం రావ‌డం లేదు. సీసీ కెమెరాలు ఉన్నా ఎవ్వ‌రూ  వాటిని ప‌ట్టించుకునే దాఖ‌లాలు కూడా లేవు.ఇక ఆన్లైన్ లో ఆయుధాల కొనుగోలు, గంజాయి అమ్మ‌కాలు ఇవ‌న్నీ కూడా పోలీసుల‌కు స‌వాలుగా మారాయి. నిన్నటి ఘ‌ట‌న‌లో నిందితులు అంతా యువ‌కులే కావ‌డంతో పోలీసులు మ‌రింత అప్ర‌మ‌త్తం కావాల్సి ఉంది. పాత నేర‌స్తుల‌కు తోడుగా ఇప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ యువ‌కులు బృందాలుగా ఏర్ప‌డి తీవ్ర నేరాల‌కు పాల్ప‌డేందుకు సైతం వెనుకాడ‌డం లేదు.

శ్రీ‌కాకుళం జిల్లా లో హ‌త్య‌లు మ‌రియు హ‌త్యా రాజ‌కీయాలు అన్న‌వి సంచ‌ల‌నం రేపుతున్నాయి. జిల్లా కేంద్రంలో వార్డు వ‌లంటీరు క‌రుణ్ కుమార్ నిన్న‌టి వేళ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గంజాయి మ‌త్తులో కొంద‌రు దుండ‌గులు పాత క‌క్ష‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను దారుణంగా హ‌త‌మార్చారు. ఇందుకు సంబంధించిన ఆయుధాల‌ను ఆన్లైన్ లో కొనుగోలు చేశారు అని తెలుస్తోంది.

దీంతో ఈ ఘ‌ట‌న స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం అయింది. వాస్త‌వానికి జిల్లా కేంద్రం, గూన‌పాలెం ప్రాంతం అంటే అంద‌రికీ సుప‌రిచితం అయిన ప్రాంతం. ఇక్కడే డీఎస్పీ కార్యాల‌యం  ఉంటుంది. ఆ కార్యాలయానికి కూత‌వేటు దూరంలోనే దారుణం జ‌రిగింది. మృతునికి భార్యా, ఇద్ద‌రు పిల్ల‌లూ ఉన్నారు.

ఎప్ప‌టి నుంచో ఇక్క‌డ గంజాయి అమ్మ‌కాల‌కు సంబంధించి అదేవిధంగా వాడ‌కానికి సంబంధించి కొన్ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్ కు కూడా వ‌లంటీరు క‌రుణ్  కుమార్ ఫిర్యాదు చేశారు.దీంతో అనుమానితుల‌ను పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపారు. పాత త‌గాదాల నేప‌థ్యంలో దుండగులు గొడ్డ‌లితో అత్యంత పాశ‌వికంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురు యువ‌కులు ఈ దాడికి పాల్ప‌డ‌గా ముగ్గురు న‌గ‌రానికి చెందిన వారు.

మ‌రో ముగ్గురు ఒడిశా ప్రాంతానికి చెందిన వారు. నిందితులు ప‌రారీలో ఉన్నారు. ఇదే ఘ‌ట‌న‌లో దారుణంగా దాడికి గుర‌యిన మ‌రో యువ‌కుడు హరీశ్ ప్ర‌స్తుతం రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. దర్యాప్తు వేగంగానే సాగుతోంది. నిందితుల త‌ల్లిదండ్రుల‌ను స్టేష‌న్ కు పిలిచి మాట్లాడారు కూడా..!
Tags:    

Similar News