భారీగా వెళ్లిపోతున్నారు.. ఈ ఏడాదిలో ఇప్పటికి రూ.48వేల కోట్లు

Update: 2022-02-21 06:33 GMT
దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు తీయటంలోనూ.. సెంటిమెంట్ ను బలోపేతం చేయటంలోనూ విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు కీలక భూమిక పోషిస్తుంటారు. వారు ముందుకు వచ్చి నిధుల వరద పారిస్తుంటే..మార్కెట్ రెట్టించిన ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు పెద్ద ఎత్తున విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని భారీగా ఉపసంహించుకుంటున్న వైనం స్టాక్ మార్కెట్ కు ప్రతికూల పరిస్థితుల్ని మరింత తీవ్రం చేస్తోంది.

ఒకవైపు సెంటిమెంట్ తేడా కొట్టటం.. విదేశీ వ్యవహారాలు.. మార్కెట్ పరిస్థితులను మరింత ప్రభావితం చేసేలా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవటం ఈ మధ్యన ఎక్కువ కావటంతో.. మార్కెట్ తీవ్ర ప్రతికూలతల్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఆరంభ నెలలోనే ఈ పెట్టుబడుల ఉపసంహరణ భారీగా సాగింది. ఒక్క జనవరిలోనే రూ.33,033 కోట్లను ఉపసంహరించుకున్నారు.

జనవరికి తగ్గట్లే.. ఫిబ్రవరిలోనూ ఈ ఉపసంహరణ పర్వం కొనసాగుతోంది. ప్రస్తుత నెలలోనే ఇదే తీరు కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరి 18 నాటికి ఈ నెలలో రూ.15,342 కోట్లను ఉపసంహరించుకున్నట్లుగా గుర్తించారు.  మరికొన్ని రోజులు ఇదే తీరు కొనసాగుతుందని భావిస్తున్నారు. మార్చి 15, 16 తేదీల్లో జరగనున్న ఎఫ్ వో ఎంసీ సమావేశం నేపథ్యంలో మార్కెట్లో కదలిక చోటు చేసుకుంటుందని చెబుతున్నారు.

ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావటం.. అమెరికాలో మాంద్యం తీవ్రతరం అవుతున్న వేళ.. ఉపసంహరణలు అంతంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఈ జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్ ఫోలియా ఇన్వెస్టర్లు రూ.48,645 కోట్లను ఉపసంహరించుకోవటం మార్కెట్ సెంటిమెంట్ ను మరింత దెబ్బ తీసేలా చేస్తోంది.
Tags:    

Similar News