సుజ‌నా.. చూపు ఎట‌న్నా?

Update: 2022-03-12 03:56 GMT
ఒక‌ప్ప‌టి టీడీపీ కీల‌క నేత‌.. ఇప్పుడు బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి మ‌రోసారి సొంత‌గూటికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? కాషాయం కండువా వ‌దిలేసి సైకిల్ ఎక్కేందుకు ఆరాట‌ప‌డుతున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో త‌న రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి ముగుస్తుండ‌డంతో ఆయ‌న తిరిగి టీడీపీలో చేరాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. బీజేపీ ఆయ‌న్ని ప‌ట్టించుకోక‌పోవ‌చ్చ‌నే ఉద్దేశంతోనే సుజ‌నా తిరిగి బాబుతో ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పార్టీకి ఓ నాయ‌కుడి వ‌ల్ల ఎంత ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే అధిష్టానం చూస్తుంది. ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న నాయ‌కుల‌కే ప్రాధాన్య‌త ఇస్తుంది. కానీ సుజ‌నా చౌద‌రికి ప్ర‌జ‌ల్లో గ్రిప్ లేద‌నే అభిప్రాయాలున్నాయి. అందుకే ఆయ‌న రెండు సార్లు పెద్ద‌ల స‌భ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ ఇప్పుడు జూన్ నెల‌తో ఆ ప‌ద‌వి ముగుస్తుంది. బీజేపీ త‌ర‌పున మ‌ళ్లీ ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి.

బీజేపీలో రాజ్య‌స‌భ ప‌ద‌వి రావ‌డం అంత సులువు కాదు. ఎందుకంటే మొద‌టి నుంచి బీజేపీనే న‌మ్ముకున్న అనేక మంది నేత‌లు రేసులో ఉన్నారు. మ‌రోవైపు రాజ‌కీయంగా సుజ‌నాకు బీజేపీలో ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పైగా బ్యాంకు రుణం ఎగ‌వేత కేసు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. దీంతో బీజేపీతో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని తెలిసింది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి అత్యంత స‌న్నిహితుడిగా సుజనాకు పేరుంది. పైగా పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఆర్థికంగానూ ఆదుకోవ‌డంతో ఆయ‌న్ని రెండు సార్లు రాజ్య‌స‌భ‌కు బాబు పంపించారు.

2014లో ఏపీలో టీడీపీ గెలిచిన త‌ర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా ఆయ‌న కేంద్ర‌మంత్రిగానూ ప‌నిచేశారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న బీజేపీలోకి వెళ్లారు. బాబు సూచ‌న‌తోనే ఆయ‌న పార్టీ జంప్ చేశార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

కానీ ఇప్పుడు బీజేపీలో సుజ‌నా ప‌రిస్థితి ఏ మాత్రం బాలేదు. ఆయ‌న మాట చెల్లుబాటు కావ‌డం లేద‌ని తెలిసింది. పైగా టీడీపీ, బీజేపీల‌ను క‌లిపేందుకు ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలూ బెడిసి కొట్టాయ‌ని స‌మాచారం. దీంతో పెద్ద‌గా విలువ లేని పార్టీలో ఉండడం కంటే తిరిగి టీడీపీలోకి వెళ్ల‌డ‌మే మేల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలిసింది. రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వీ కాలం ముగిసిన వెంట‌నే ఆయ‌న తిరిగి టీడీపీ గూటికి చేరే అవ‌కాశముంది.
Tags:    

Similar News