టీఆర్ఎస్ నుంచి ముందు స‌ర్దుకుంటున్నారుగా.. వ‌ల‌స‌లు షురూ...!

Update: 2022-03-11 07:30 GMT
భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి వ‌ల‌స‌లు షురూ అయ్యాయా..? టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నుంచి కీల‌క నేత‌లు బయ‌టికి రానున్నారా..? ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు కేసీఆర్ కొంప ముంచ‌నున్నాయా..? ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేర‌నున్న మొద‌టి నేత జూప‌ల్లి కృష్ణారావేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల‌ జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు నిన్న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ కంగారూలా దూసుకెళ్లింది.  ఒక్క పంజాబ్ లో త‌ప్ప మిగ‌తా రాష్ట్రాల్లో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో మ‌రోసారి జెండా ఎగుర‌వేసింది. అత్య‌ధిక స్థానాలు సాధించి త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకుంది.

గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినా అవి నామ‌మాత్ర‌మే. ఢిల్లీ కోట దారికి యూపీ ఫ‌లితాలే కీల‌కం. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ మ‌రోసారి విజ‌యం సాధించాలంటే.. మోదీ తిరిగి ప్ర‌ధాని కావాలంటే యూపీ ఎన్నిక‌లే ఆధారం. అందులో భాగంగా 400 పై చిలుకు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 270 పైగా సీట్లు సాధించి రేసుగుర్రంలా ప‌రుగెత్తింది. దీంతో 80 లోక్ స‌భ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

దీంతో బీజేపీ శ్రేణులు సంపూర్ణ ఆత్మ‌విశ్వాసంతో ఉన్నారు. క్యాడ‌ర్లో జోష్ పెరిగింది. ఇక పార్టీ త‌ర్వాతి ల‌క్ష్యం ద‌క్షిణాది రాష్ట్రాలే. వ‌చ్చే ఏడు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో రెండు ప్ర‌ధాన రాష్ట్రాలు ద‌క్షిణాదిలోనే ఉన్నాయి. అందులో ఒక‌టి క‌ర్ణాట‌క‌. మ‌రొక‌టి తెలంగాణ‌. క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఎలాగూ అధికారంలో ఉంది. ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్ర‌మే.తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల మోదీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో బీజేపీ నేత‌ల్లో ప‌ట్టుద‌ల పెరిగింది. ఎలాగైనా కేసీఆర్ ను గ‌ద్దె దించాల‌ని ఫిక్స్ అయ్యారు. తొలుత ఆ పార్టీ అసంతృప్త నేత‌ల‌పై దృష్టి పెట్టారు.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ.. ఇటీవ‌ల కేసీఆర్ వ‌న‌ప‌ర్తి స‌భ‌కు కూడా హాజ‌రు కాని జూప‌ల్లిపై వ‌ల వేశారు. ఆయ‌న‌తో బీజేపీ శ్రేణులు సంప్ర‌దింపులు జ‌రిపినట్లు స‌మాచారం. జూపల్లి కూడా ఇందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు.. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. జూప‌ల్లి వీడితే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన తొలి వికెట్ ఆయ‌న‌దే అవుతుంది. ఇదే దారిలో మ‌రికొంద‌రు వెళ్ల‌వ‌చ్చు.

ఇక మ‌రో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ పై కూడా బీజేపీ ఫోక‌స్ పెట్టింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వ‌కుండా ఉంటే ఈ పాటికి ఎంతో మంది కాంగ్రెస్ నేత‌లు బీజేపీకి క్యూ క‌ట్టేవారే. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నామ‌మాత్రంగా మిగ‌ల‌డంతో ఆ పార్టీలోని చాలా మంది సీనియ‌ర్లు కూడా బీజేపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారట‌. ఆ పార్టీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారట‌.

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల రెడ్డి ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ తో అంటీముట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వ‌డంతో పార్టీకి మ‌రింత దూర‌మ‌య్యారు. ఆయ‌న కూడా చాలా రోజుల నుంచి బీజేపీపై మ‌న‌సు ప‌డ్డారు. బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్ లో ఉంటున్నారు. త్వ‌ర‌లో కాషాయం కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఇక పార్టీ మ‌రో అసంతృప్త ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కూడా డైల‌మాలో ఉన్న‌ట్లు స‌మాచారం. టీఆర్ఎస్ లో చేరాలా.. బీజేపీలో చేరితో బాగుంటుందా అనే మీమాంస‌లో ప‌డ్డార‌ట‌. చూడాలి మ‌రి తెలంగాణ‌లో బీజేపీ నేత‌ల ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేరుతాయో..!
Tags:    

Similar News