పవన్ ఎందుకు నోరిప్పటంలేదు ?

Update: 2022-03-24 13:30 GMT
అదేదో సినిమాలో డైలాగు చెప్పినట్లు వెనక్కు తగ్గేదేలే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంగా ప్రకటించేసింది. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ, టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామచంద్రప్రసాద్ సింగ్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గేదేలే అని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ఎందుకనేందుకు కేంద్రం తన వాదనకు తాను కట్టుబడుంది. ఇదే సమయంలో ప్రైవేటీకరణ ఎందుకు చేయకూడదో ఎంపీలు చెప్పారు.
 
అయితే ఎవరెంత చెప్పినా కేంద్రం నిర్ణయమే ఫైనల్ కాబట్టి ప్రైవేటీకరణ నుంచి వెనక్కు తగ్గేదేలే అనేది అందరికీ తాజాగా అర్ధమైపోయింది. సరే ఈ విషయం ఇలాగుంటే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాన్ ఇపుడేమి చేస్తారు ? అనేది ఆసక్తిగా మారింది.

ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ ఇపుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ? ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నరేంద్ర మోడీ సర్కార్ నడుచుకుంటున్న విషయం పవన్ కు కనబడలేదా ? అనే డౌటు పెరిగిపోతోంది.
 
పవన్ పద్దతిగా ఉన్న నేతైతే ఈపాటికే విశాఖ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రాన్ని నిలదీసుండాలి. అలా చేయకపోతే బీజేపీ నేతలు ఎన్ని అబద్ధాలు చెబుతున్నా ఖండించటం లేదు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో నిజాలు మాట్లాడటానికి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి బీజేపీ లోకల్ నేతలకు ఏవో ఇబ్బందులుంటాయి. మరి పవన్ కు ఏమి ఇబ్బందులున్నాయని నోరిప్పటంలేదు ?

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వేలాదిమంది ఇబ్బందులు పడుతుంటే కూడా పవన్ నోరిప్పి ప్రశ్నించకోపోతే ఇంకెపుడు ప్రశ్నిస్తారు ? పైగా తనను గెలిపించుంటే తాను విశాఖ స్టీల్ సమస్యపై కేంద్రాన్ని ప్రశ్నించుడే వాడినని స్వయంగా వైజాగ్  సభలోనే చెప్పారు.

అంటే తనను జనాలు ఓడించారు కాబట్టే ఫ్యాక్టరీ ఏమైపోయినా తాను మాట్లాడకూడదని పవన్ నిర్ణయించుకున్నారా ? అనే డౌటనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా పవన్ పార్టీపెట్టింది ప్రశ్నించటానికి కాదని అర్ధమైపోతోంది.
Tags:    

Similar News