షాకింగ్ వ్యాఖ్య చేసిన పరిటాల సునీత.. కారు బాంబు పెట్టింది ఆ వైసీపీ ఎమ్మెల్యేనట

Update: 2022-03-21 04:45 GMT
ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర శివారులోని శ్రీరాములయ్య మూవీ షూటింగ్ వద్ద కారు బాంబు పేలటం.. 26 మంది ప్రాణాలు పోయిన ఉదంతం చాలామందికి తెలిసినదే అయినా.. దాని వెనుక ఉన్నదెవరు?  అన్న దానిపై బోలెడన్ని కథనాలు వినిపిస్తూ ఉంటాయి.

దివంగత టీడీపీ నేత పరిటాల రవిని టార్గెట్ చేసి.. కారు బాంబును సెట్ చేయటం.. అనూహ్యంగా ఆయన తప్పించుకొని.. ఆయనకు కావాల్సిన వారి ప్రాణాలు పోవటం తెలిసిందే. ఈ విషాద ఉదంతం చోటు చేసుకున్న ఇన్నాళ్ల తర్వాత.. తాజాగా మాజీ మంత్రి పరిటాల సునీత ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సదరు కారు బాంబును పెట్టి 26 మందిని పొట్టన పెట్టుకున్నది మరెవరో కాదని.. వైసీపీ ఎమ్మెల్యే అండ్ కో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ దే ఈ పాపమన్న పరిటాల సునీత వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ''26 మందిని పొట్టన పెట్టుకోవటంతో ప్రకాశ్ రెడ్డి కూడా భాగస్తుడే. మా చరిత్ర కాదు.. ప్రకాశ్ రెడ్డి చరిత్రే తెలుసుకోవాలి. ప్రకాశ్ రెడ్డి అవినీతిపై సినిమా తీసే రోజు దగ్గర్లోనే ఉంది'' అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

తమ కుటుంబం గురించి మాట్లాడే వారంతా.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేల గురించి మాట్లాడరేమని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు వీలుగా విమర్శలు చేయటం కాదని.. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న  ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలన్నారు. తమ కుటుంబాన్ని విమర్శించటమే పనిగా రాప్తాడు ఎమ్మెల్యే పెట్టుకున్నట్లుగా పరిటాల సునీత ఆరోపించారు.

తరచూ దివంగత నేత పరిటాల రవిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలు.. ఆయన కాలి గోటికి కూడా సరిపోరన్నారు. పరిటాల రవితో వైసీపీ ఎమ్మెల్యే  ప్రకాశ్ రెడ్డిని పోల్చటమా? అంటూ ఆమె మండిపడ్డారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కనగానపల్లి గ్రామంలో నిర్వహించిన టీడీపీ కార్యక్రమం సందర్భంగా.. కార్యకర్తలతో గ్రామం మొత్తం నిండిపోయింది.

ఏదైనా సమస్య ఉంటే తనతో నేరుగా మాట్లాడాలే తప్పించి.. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చనిపోయిన పరిటాల రవి గురించి మాట్లాడటం ఏ మాత్రం సరికాదంటూ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. పరిటాల సునీత.. ఆమె కుమారుడు కమ్ రాజకీయవారసుడు పరిటాల శ్రీరామ్ కలిసి చేసిన తాజా ఆరోపణలు.. విమర్శలకు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి
Tags:    

Similar News