ఈ ఎదురుదెబ్బలకు అంతం లేదా జగన్?

Update: 2022-03-16 11:45 GMT
చేసిన తప్పును మళ్లీ చేయొద్దని చెబుతారు. తెలివైన వాళ్లు అలాంటి పని చేయరని.. అందుకు ఎప్పటికప్పుడు కొత్త తప్పులు చేయాలని చెబుతుంటారు. మరీ.. విషయాన్ని ఏపీ సర్కారు మరోలా అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. తప్పుల మీద తప్పులు చేస్తూ.. తరచూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు వేయించుకోవటం ఒక అలవాటుగా మారినట్లుగా కనిపిస్తోంది. ఎందుకిలా? అని ప్రశ్నిస్తే.. తాము డిసైడ్ చేసిందే జరగాలన్న ముకుంపట్టుతోనే ఇలాంటి పరిస్థితి అన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటికే పలు అంశాల్లో హైకోర్టులో ఎదురుదెబ్బలు తిన్న ఏపీ సర్కారుకు తాజాగా మరో అంశంలో ఎదురుదెబ్బ తప్పలేదు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బిల్లులు చెల్లించాలంటూ తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉన్నా.. వాటిని చెల్లించని వైనంపై విద్యుత్ ఉత్పత్తి దారులకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును ఇచ్చారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం బిల్లుల్ని తగ్గించి ఇవ్వాలని పేర్కొన్నారు. పీపీఏలకు వ్యతిరేకంగా ఏపీ ఈఆర్సీలో ప్రభుత్వం వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది.

స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ వేసిన పిటిషన్లను కొట్టేసింది. ఇప్పటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఏపీ ప్రభుత్వం సుమారు రూ.20వేల కోట్ల వరకు బకాయిలు పడింది.

దీంతో.. సదరు కంపెనీలు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ.. హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా బిల్లులు తగ్గించి చెల్లించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది. అదే సమయంలో.. విద్యుత్ బకాయిల్ని ఆరు వారాల వ్యవధిలో చెల్లించాలని పేర్కొంది. చెల్లింపుల్లో జాప్యం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఒక్క అంశంలోనే కాదు.. తరచూ జగన్ ప్రభుత్వానికి పలు అంశాల్లో కోర్టు ఎదుట ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వాటి నుంచి బయటపడేలా ప్లాన్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News