పవన్ అజెండా ఇదేనా ?

Update: 2022-03-14 05:30 GMT
సోమవారం జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ సింగిల్ పాయింట్ అజెండాతోనే నడవబోతోందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండున్నరేళ్ళల్లో జనాలు ఎదుర్కొన్న కష్టాల గురించి సభలో ప్రస్తావించనున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ఆవిర్భావ సభ గురించి పవన్ పెద్ద ట్వీట్ పెట్టారు. ఇందులో పార్టీకి సంబంధించి, వీర మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. పనిలోపనిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కూడా ఒక కామెంట్ ఉంది.
 
ఆ కామెంట్ చూసిన తర్వాత సభ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. ఈ సభ నుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయబోతున్నట్లు పవన్ చెప్పారు. ఈ విషయమే కాస్త విచిత్రంగా అనిపిస్తోంది.  మామూలుగా దిశానిర్దేశం అన్నది అధికారంలో ఉన్న పార్టీ నిర్దేశిస్తుంది. అంతేకానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిర్దేశించగలిగే దిశ అంటు ప్రత్యేకించి ఏమీ ఉండదు.
 
అధికారంలోకి రావటమే ప్రధాన అజెండాగా ప్రతిపక్షాలు పనిచేస్తుంటాయి. ఇందులో భాగంగానే తమ అజెండాను సెట్ చేసుకుంటాయి. ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవటమే టార్గెట్ గా ప్రతిపక్షాలు పనిచేస్తాయంతే. ఇందులో దిశానిర్దేశం ఏమీఉండదు.

ప్రభుత్వ విధానాల్లో తప్పులుంటే ఎత్తిచూపటం, అక్రమాలు, అవినీతి ఎండగట్టడమే ప్రతిపక్షాల ప్రధాన అజెండాగా ఉంటుంది. ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు కరెక్టే అనుకుంటే జనాలు ప్రతిపక్షాల్లో తమకు నచ్చిన పార్టీకి మద్దతుగా నిలబడతారు.
 
ఇపుడున్న పరిస్దితుల్లో పవన్ అజెండా సెట్ చేసినా, దిశానిర్దేశం చేసినా ఎంతమంది జనాలు పట్టించుకుంటారన్నది అనుమానమే. ఎందుకంటే ఏ విషయంలో కూడా పవన్ కు స్థిర అభిప్రాయం అన్నదే ఉండదు. జగన్ను వ్యతరేకించటంలో తప్ప మరే విషయంలోను పవన్ స్ధిరభిప్రాయంతో ఉండరని అందరికీ తెలిసిందే.

ఈరోజు చెప్పినమాట రేపటికి మరచిపోతారు. ఒకవైపు రాజకీయాల్లో మరోవైపు సినిమాల్లో రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్న పవన్ దిశానిర్దేశం చేస్తానని చెప్పటమే విచిత్రంగా ఉంది. అయినా సరే ఏమి నిర్దేశిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News