కనుమరుగు దశకు కరోనా.. అయితే ట్విస్ట్ ఇచ్చిన పరిశోధన

Update: 2022-02-15 05:00 GMT
ప్రపంచాన్ని రెండేళ్లుగా గుప్పిట పట్టి వేధిస్తున్న కరోనా మహమ్మారి చివరిదశకు చేరుకున్నట్టు ప్రఖ్యాత ‘మెడికల్ జర్నల్ ది లాన్సెట్’ తన సంపాదకీయంలో పేర్కొంది. అంతమాత్రాన అది పూర్తిగా కనుమరుగైనట్లు కాదని.. అది ఎప్పటికీ మనతోనే ఉంటుందని హెచ్చరించింది. అయితే తీవ్రత మాత్రం సీజనల్ ఇన్ ఫ్లూయెంజా మాదిరిగా ఉంటుందని పేర్కొంది.

రెండేళ్లుగా కరోనా కారణంగా ఇతర వ్యాదులపై పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్నాయి. కరోనా తీవ్రత ముగింపు దశకు వచ్చినందున ఇక మీదట ఇతర సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులపై పరిశోధనలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ రకంతో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేవ్ ను సృష్టించిన కోవిడ్19 ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. మహమ్మారి దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు ప్రఖ్యాత మెడికల్ ఏజెన్సీలు ప్రకటించాయి. జనవరి చివరి వారంలోనే 2.2 కోట్ల కేసులు, 59వేల మరణాలు నమోదైన విషయాన్ని గుర్తుంచుకొని.. విస్తృత స్థాయిలో టీకాల కార్యక్రమం జరిగిన దేశాల్లో కేసులు, మరణాల మధ్య తేడా కనిపించింది. అయితే ఆ లంకె పూర్తిగా తెగిపోలేదు.

కరోనా ఎండెమిక్ గా మారినప్పటికీ అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇది ఎండెమిక్ గా మారినంత మాత్రాన తేలికైపోయిందనుకోవడానికి వీల్లేదు. ఎక్కువమంది జనాభా దీన్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంచుకున్నారన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో దీని తీవ్రత సీజనల్ ఇన్ ఫ్లూయెంజాకు దగ్గరగా ఉంటుంది.

కోవిడ్ వంటి మహమ్మారులను కూడా తట్టుకొని నిలిచి, దాన్ని ఎండెమిక్ గా మార్చే సాధనాలను అది మన చేతిక్కిచ్చింది. ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఉత్తమమైన టీకాలు, చికిత్సలు అవసరం అని మెడికల్ జర్నల్స్ తెలిపాయి. కోవిడ్ 19 గుణపాఠాలతో ఇతర వ్యాధులపై పరిశోధనలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముందే పసిగట్టి వాటి నివారణకు తోడ్పడాల్సి ఉంటుంది.
Tags:    

Similar News