ఎంత బాలివుడ్ బాద్ షా కొడుకైనా ...

Update: 2021-10-16 07:10 GMT
తలరాతను ఎవరు తప్పించలేరంటారు. గ్రహస్ధితిగతులను బట్టి మన తలరాతలు మారిపోతుంటాయి. ఈ నిమిషంలో కింగ్ లా ఉన్న వ్యక్తి మరు నిముషంలో ఏమైపోతాడో ఎవరికీ తెలీదు. ఇప్పుడిదంతా ఎందుకంటే బాలీవుడ్ బాద్ షా గా పాపులరైన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించే ఇదంతా. దాదాపు పది రోజుల క్రితం ఓ క్రూయిజ్ లో జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారుల దాడిలో చాలామంది తగులుకున్నారు. వారిలో ఆర్యన్ ఖాన్ కూడా ఒకడు.

దాడుల్లో  ఆర్యన్ తగులుకున్నపుడు  అతని దగ్గర నిషేధిత మత్తు పదార్థం అంటే ఛరస్ లాంటిది ఏవీ లేదు. అయితే అప్పటికే  ఆర్యన్ ఛరస్ తీసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. అలాగే అతని మిత్రుడు అర్బాజ్ ఖాన్ దగ్గర మాత్రం 5 మిల్లీ గ్రాముల మత్తుపదార్థం దొరికిందట. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొడుకును బెయిల్ పై బయటకు తీసుకు రావటానికి షారుఖ్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో అందరు చూస్తున్నదే. దేశంలోనే ఖరీదైన లాయర్ ని  పెట్టుకున్నా నాలుగు సార్లు బెయిల్ రెజెక్టయ్యింది.

ఎప్పటికప్పుడు బెయిల్ మంజూరైపోతుందని అనుకోవటం విచారణలో రిజెక్టవటం మామూలైపోయింది. ఇపుడు బెయిల్ రెజెక్టయిన కారణంగా 20వ తేదీ వరకు ముంబైలోని ఆర్ధర్ రోడ్డులో ఉన్న జైలులో ఉండి పోవాల్సిందే. ముంబయిలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లోని అత్యంత ఖరీదైన ప్యాలెసుల్లో షారూఖ్ ఖాన్ ‘మన్నత్’ కూడా ఒకటి. ఈ ప్యాలెస్ లో ఆర్యన్ కు విలాసవంతమైన బెడ్ రూమ్ ఉందట. ఆ బెడ్ రూమ్ లో ఖరీదైన టీవీ, రిఫ్రిజిరేటర్, అత్యంత విలాసవంతమైన బాత్ రూమ్ ఉందట.

అంతటి లగ్జరీ ప్యాలెస్ లో హ్యాపీగా ఉంటున్న ఆర్యన్ ఇపుడు జైల్లోని ఇరుకు గదుల్లో 250 మంది ఖైదీలతో కలిసి ఉంటున్నాడు. నిజానికి ఈ బ్యారక్ లో ఉండాల్సిన ఖైదీల సంఖ్య 70 మందే కానీ సరిపడా స్ధలం లేకపోవటంతో 250 మందిని ఉంచుతున్నారు. ఉదయం 6 గంటలకే ఖైదీలను విజిల్ వేసి జైలు అధికారులు నిద్ర లేపేస్తున్నారు. మామూలుగా అయితే ఆర్యన్ డే మొదలయ్యేదే ప్రతిరోజు మధ్యాహ్నం పైనేనట. ఎందుకంటే రాత్రంతా ఎక్కడో పబ్బుల్లోనో, బార్లు లేకపోతే పార్టీల్లో గడిపి రావటం ఆర్యన్ కు అలవాటు.

అలాంటి ఆర్యన్ ఇపుడు ఆరుబయట మిగిలిన ఖైదీలతోనే స్నానం చేస్తున్నాడు. జైల్లో బాత్ రూమ్ లు ఎంత శుభ్రంగా ఉంటాయో చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అందుకనే బాత్ రూమ్ కు వెళ్ళాల్సొస్తుందని గడచిన వారం రోజులుగా భోజనం కూడా చేయటంలేదు. ఈ రోజో రేపే బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా బయటకు వెళ్ళచ్చని ఆర్యన్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వారం వరకు జైల్లోనే ఉండాలని తేలిపోయిందో ఇపుడు ఏమి చేయాలో అర్థం కావటం లేదట. ఇపుడు జైలు భోజనం కోసం అందరితో పాటు క్యూలో నిలబడక తప్పలేదు.

మిత్రులు లేరు, టీవీ లేదు, ప్రత్యేకంగా బెడ్ రూమ్ లేదు. ఉదయం 6 గంటలకు లేచి స్నానం చేయాల్సిందే. అది కూడా తోటి ఖైదీలందరితో కలిసి.  నచ్చినా నచ్చకపోయినా ఉన్న కొద్ది బాత్ రూమ్ లనే వాడుకోవాలి. ఆర్యన్ నిజంగానే ఛరస్ తీసుకున్నాడో లేదో తెలీదు. కానీ తీసుకున్నాడని ప్రభుత్వ న్యాయవాది బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఆర్యన్ జరిగినట్లు చెబుతున్నాడు. అందుకు తన మొబైల్ నుండి జరిగిన వాట్సప్ చాటింగ్ నే సాక్ష్యంగా కోర్టులో చూపారు. మొత్తానికి 20వ తేదీ తర్వాత ఆర్యన్ భవిష్యత్తు ఏమిటో తేలుతుంది.
Tags:    

Similar News