ఇటు 15... అటు 151... భయపడుతున్నదెవరు... ?

Update: 2022-03-22 14:30 GMT
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే ఒక విషయం అర్ధమవుతోంది. ఈ సభలో విపక్ష సభ్యులు ఎంత సేపు ఉన్నారు. వారిని ఎంత సేపు ఉంచారు అన్న పాయింట్ అయితే ప్రతీ వారిలోనూ వస్తుంది. నిజానికి ప్రధాన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షంగా 2019 తరువాత ఏర్పడిన ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఉంది. మూడేళ్లుగా సభ జరుగుతున్న తీరు చూస్తే విపక్షం సభలో ఉన్న సందర్భాలు  తక్కువే అనిపించకమానదు.

అసలు ఎందుకిలా జరుగుతోంది అన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. ఇదిలా ఉంటే ఏపీలో పాలన సగానికి వచ్చాక సభకు నమస్కార అని చంద్రబాబు అనేశారు. దాని కంటే ముందు అయిదారురుగు సభ్యులు టీడీపీకి దూరం జరిగారు. ఇక బాబు బావమరిది బాలయ్య సభకు వచ్చేది తక్కువ.

ఇలా టోటల్ గా తీసివేతలు చూస్తుకుంటే మొత్తంగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో సభలో ఉండేది అచ్చంగా 15 మంది మాత్రమే. వీరిలో కూడా కొందరు సభ్యులు హడావుడి చేసేది తక్కువ. మరి అటు వైపు చూస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి మద్దతుగా జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే, టీడీపీ నుంచి అటు వైపు వెళ్ళిన వారు ఉన్నారు. ఇలా చూసుకుంటే అసెంబ్లీలో తొంబై శాతం బలమంతా వైసీపీదే.

అదే టైం లో పట్టుమని పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా లేని టీడీపీని చూసి అధికార పార్టీ నిజంగా భయపడుతోందా అన్న డౌట్ అయితే వస్తుంది. సభకు సజావుగా నడిపించుకోవచ్చు. విపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు వారు కోరినట్లుగా కాకుండా తాము అనుకున్నట్లుగా జవాబు ఇవ్వవచ్చు.

ఇక సభలో చర్చ కూడా చక్కగా చేసుకోవచ్చు. మరి ఇంతటి అనుకూలత ముందు ప్రభుత్వం టీడీపీకి లేదు కదా. నాడు 67 మందితో వైసీపీ సభ్యులు ఉండేవారు. వారి నుంచి 23 మందిని తరువాత కాలంలో టీడీపీ తీసుకున్నా 44 మంది మెంబర్స్ నికరంగా నాడు మిగిలారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ సభను నిర్వహించింది కదా.

మరిపుడు మొత్తం సభలో పది శాతం లేని టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు వరసగా సస్పెన్షన్లు చేస్తూ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది. దీని మీద సభ బయట కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే సభలో టీడీపీ మెంబర్స్ ఉన్నది తక్కువ మందే అయినా వారు రైజ్ చేసే ఇష్యూస్ మాత్రం గట్టిగానే ఉంటున్నాయని, అందుకే అధికార పక్షం తట్టుకోలేకపోతోంది అని అంటున్నారు.

గతంలో కూడా విపక్షంలో టీడీపీ ఉన్న అనుభవం తో పాటు సీనియర్ మెంబర్స్ ఎక్కువగా ఉండడంతో సభలో అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విపక్షం చూడడం వల్లనే దాన్ని అధిగమించేందుకు తరచూ సస్పెన్షన్స్ వేటు వేస్తోంది  అంటున్నారు. అయినా సరే సభలో విపక్షం ఉండాలి, వారు ఏమైనా అడగనీ, సమాధానం ఇచ్చే నేర్పూ ఓర్పూ అధికార పక్షానికి ఉండాలని మేధావులు అంటున్నారు. సభ నుంచి సభ్యులను పంపించడం మంచి విధానం కాదనే అంటున్నరు.

దీని మీద సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ సర్కార్ కి టీడీపీ అంటే భయమని అన్నారు. తాము ప్రజా సమస్యలు లేవనెత్తుతూంటే వాటికి జవాబు చెప్పలేకనే సస్పెషన్స్ అంటున్నారని విమర్శించారు. మొత్తానికి లాజిక్ చూస్తే 15 కంటే 151 ఎక్కువే. కానీ ఇపుడు అసెంబ్లీ సీన్ చూస్తే రామానాయుడు మాటలే నిజమనుకోవాలా.
Tags:    

Similar News