సభాసంఘం ఏం తేలుస్తుంది ?

Update: 2022-03-26 05:53 GMT
చంద్రబాబు నాయుడు హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారనే ఆరోపణలపై విచారణ చేయటానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ సభాసంఘం వేశారు. ఈ సభా సంఘంలో అందరూ ఎంఎల్ఏలు మాత్రమే ఉన్నారు.

భూమన కరుణాకరరెడ్డి ఛైర్మన్ గా ఉండే కమిటిలో కే భాగ్యలక్షి, జీ అమర్నాథ్, కే అబ్బయ్య చౌదరి,  కే పార్ధసారధి, మేరుగ నాగార్జునతో పాటు టీడీపీ సభ్యుడు మద్దాలి గిరి సభ్యులుగా ఉంటారు.

అసెంబ్లీలో ఉన్నదే రెండు పార్టీల ఎంఎల్ఏలు కాబట్టి ఐదుగురు వైసీపీ సభ్యులను, ఒక టీడీపీ ఎంఎల్ఏని స్పీకర్ నియమించారు. సభాసంఘం వేశారు సరే ఇది ఏమి తేలుస్తుంది ? అనేదే అందరికీ డౌటు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగులుకు సంబంధించి అధికారికంగా ఎక్కడా ఆధారాలు దొరికే అవకాశాలు లేవనే చెప్పాలి. అసలు ఈ ఆరోపణలకు మూల కారణమైన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తెలీదు.

మమత చేసిన ఆరోపణల ఆధారంగా అసెంబ్లీలో చర్చ జరగటం, లోతుగా విచారణ చేయటం కోసం సభాసంఘం నియమించటం వల్ల ఏమిటి ఉపయోగమో అర్ధం కావటం లేదు. ఒకవేళ అధికారికంగా పెగాసస్ ను కొనుగోలు చేసుంటే దానికి సంబంధించిన ఫైళ్ళు ఇప్పటికే బయటపడుండాలి.

సాఫ్ట్ వేర్ కొనుగోలు, డబ్బులు చెల్లింపులకు సంబంధించిన రికార్డులు దొరికేవే. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళయినా అలాంటివేమీ బయటపడలేదంటే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను  కొనలేదని అర్ధమవుతోంది.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా సభాసంఘం నాలుగు రోజులు హడావుడి చేసి చివరకు ఏమీ తేల్చలేక చేతులెత్తేస్తుందేమో అనిపిస్తోంది. పైగా సభా సంఘంలోని సభ్యుల్లో ఎంతమందికి టెక్నాలజీ మీద పట్టుందో తెలీదు. సాఫ్ట్ వేర్, హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ లాంటి, మాల్ వేర్, స్పైవేర్ లాంటి అంశాల్లో నిపుణులు మాత్రమే పెగాసస్ సాఫ్ట్ వేర్ లాంటి వాటిని గుర్తించే అవకాశముంది. మరిపుడు ఈ సభ్యులకు అంతటి పరిజ్ఞానముందా?
Tags:    

Similar News