సోము వీర్రాజు ఫీట్లు ప‌నిచేస్తాయా...?

Update: 2022-03-28 05:36 GMT
క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు!  ఈ మాట ఆయ‌నే ఒప్పుకుంటారు. రాష్ట్రంలో క‌నీసం 5 శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. ఇదీ కూడా నిజ‌మేన‌ని చెబుతారు. ఇక‌, పార్టీకి అన్ని జిల్లాల్లోనూ స‌రైన నాయ‌క‌త్వ‌మే లేదు.. దీనిని కాద‌ని అన‌లేరు. కానీ, పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంద‌ని మాత్రం చెబుతుంటారు. కాద‌ని ఎవ‌రైనా అంటే.. బీజేపీ ద్రోహులు అనే ముద్ర వేసేస్తారు. ఆయ‌నే సోము వీర్రాజు. బీజేపీ ఏపీ చీఫ్‌గా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి.. త్వ‌ర‌లోనే రెండు సంవ‌త్సాలు పూర్తి చేసుకోనున్నారు. మ‌రి వెన‌క్కి తిరిగి చూసుకుంటే.. ఏముంది ? అని చూస్తే.. ఏమీ క‌నిపించ‌డం లేదు. ఆయ‌న చేస్తున్న స‌ర్క‌స్ ఫీట్లు త‌ప్ప‌. ఇటీవ‌ల ఆయ‌న మీటింగుల‌ను మీడియా కూడా క‌వ‌ర్ చేయ‌డం మానేసింద‌నే టాక్ వినిపిస్తోంది.

దీంతో ఇత‌ర నేత‌ల‌ను పిలిపించుకుని.. వారు వ‌స్తున్నారు.. వీరు వ‌స్తున్నారు. రండి! అంటూ. మీడియాను పిలుస్తున్నార‌ట‌. మ‌రి ఇంత‌గా ఎందుకు బీజేపీ దిగ‌జారిపోయింది. ఇది పార్టీ త‌ప్పా.. పార్టీని న‌డిపిస్తున్న బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు త‌ప్పా! అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే..

ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత ఈజీ అయితే.. బీజేపీకి లేదు. ఎందుకంటే.. వైసీపీ చేస్తున్న సంక్షేమాన్ని త‌ట్టుకుని.. అదే త‌ర‌హా హామీలు ఇవ్వ‌గ‌ల‌గాలి. కానీ.. నేరుగా ప్ర‌జ‌ల‌కు సొమ్ములు ఇచ్చేందుకు బీజేపీ పూర్తిగా వ్య‌తిరేకం.

ఇక‌, కేంద్రం నుంచి సాధించాల్సిన కార్య‌క్ర‌మాలు కూడా చాలానే ఉన్నాయి. వీటికితోడు.. రోజు రోజుకు కొర్రీ ప‌డుతున్న పోల‌వ‌రం ప్ర‌జ‌ల‌ను వెక్కిరిస్తోంది. దీనికి కూడా రేపు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. సోము వీర్రాజు.. స‌మాధానం చెప్పాలి. ఏదో ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం చేయ‌డం వేరు.

కానీ.. సార్వ‌త్రిక స‌మ‌యంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను దాట‌వేస్తే ప్ర‌జ‌లు ఊరుకుంటారా? అనేది మేధావుల ప్ర‌శ్న‌. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని కోరుతున్నారు. మ‌రి క‌ర్నూలులో హైకోర్టు మాటేంటి..? ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి పూచీ ప‌డుతున్న విష‌యం ఏంటి? ఇవ‌న్నీ.. స‌మాధానం రావాల్సిన‌.. రేపు బీజేపీ నేత‌లుచెప్పాల్సిన ప్ర‌శ్న‌లు.

అంతేకాదు.. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌ర‌చి చూస్తే.. బీజేపీకి ఎంత మంది అభ్య‌ర్థులు ఉన్నారు? క‌నీసం స‌గ‌మైనా.. అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. నిల‌బెట్ట‌గ‌ల‌రా..? అంతెందుకు త‌నే పోటీచేస్తే.. గెలుస్తాన‌ని.. భ‌రోసా ఇవ్వ‌గ‌ల స్థాయిలో వీర్రాజు ఉన్నారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇలాంటి వాటికి ప‌రిష్కారాలు వెత‌కాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. వీటిని వ‌దిలేసి.. పైపైకి మేం అధికారంలోకి వ‌చ్చేస్తాం అని చెబితే.. న‌మ్మేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా అయితే.. లేర‌నేది.. బీజేపీ నాయ‌కులు గుర్తించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News