8 ఏళ్లలో 80 లక్షల కోట్లు చేసినందుకేనా బీజేపీ సంబరాలు?

Update: 2022-05-29 09:30 GMT
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సంబరాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా రెండు వారాలపాటు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2014 ఏప్రిల్, మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్ 14 వరకు ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ రూపకల్పన చేసింది. క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజలను కలిసేందుకు 75 గంటల ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని చెబుతోంది.

కాగా బీజేపీ ఎనిమిదేళ్ల సంబరాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినందుకా ఈ సంబరాలు నిర్వహిస్తుందని ఎద్దేవా చేస్తున్నాయి. దేశాన్ని అప్పుల్లో ముంచి అంబానీ, అదానీల వంటి బడా కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను నరేంద్ర మోదీ ప్రభుత్వం దోచిపెట్టిందని మండిపడుతున్నాయి.

అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మోదీ ప్రభుత్వం అనుసరించిందని దుయ్యబడుతున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో మేజర్ వాటాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడం, కోవిడ్ ను నియంత్రించలేక కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొనడం తప్ప నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలేమిటని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.

నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని మాటల దాడి చేస్తున్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను వాడుకుని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడం తప్ప ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఒక్క ఘనత ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నాయి.

చైనా మనదేశంలోకి చొచ్చుకువచ్చి అనేక ప్రాంతాలను ఆక్రమించినా, మన దేశ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్నా మోదీ ప్రభుత్వం నిద్రపోతోందని ప్రతిపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. రైతుల నడ్డి విరవడానికి వివాదాస్పద సాగు చట్టాలను తెచ్చి.. వాటిని రద్దు చేయాలని నిరసనలకు దిగిన రైతులను హత్య చేయించడం వంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని విరుచుకుపడ్డాయి.

మరోవైపు ఈ ఎనిమిదేళ్లలో తలదించుకునే పని చేయలేదని మోదీ చెప్పడంపైనా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నవారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేయడం, జైలు పాలు చేయడం, కొంతమందిని నకిలీ ఎన్ కౌంటర్లలో మట్టుబెట్టడం వంటి నీచమైన పనులన్నీ మోదీ ప్రభుత్వం చేయించిందని ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి.
Tags:    

Similar News