ముగ్గులోకి లాగి మరీ : ధీమా పెరిగిందా... వ్యూహమేనా...?

Update: 2022-05-29 11:30 GMT
రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. కచ్చితంగా ముక్కుసూటిగా ఎవరైనా ఏమైనా చెబితే అది వర్తమాన  రాజకీయాల్లో చెల్లదు. అలాగే పెదవుల మీద మాటలను చూసి రెండు అడుగులు ముందుకు వేసి వస్తే బుక్ అయిపోవడం ఖాయం. ఇపుడు ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య అదే జరుగుతోందా అన్న చర్చ అయితే బయల్దేరింది. టీడీపీ మహానాడు గ్రాండ్ లెవెల్ లో సాగింది. గతంతో పోలిస్తే అద్భుతంగా మహానాడు సాగింది అని చెప్పాలి. ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి ఈ పార్టీ సభ మీద ఆసక్తి కనిపించింది.

ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీలోనూ ధీమాను పెంచింది. అందుకే మహానాడును చంద్రబాబు చాలా తెలివిగానే నడిపారు. ఎక్కడా ఒక పొల్లు మాట కానీ అనవసరపు స్టేట్మెంట్స్ కానీ లేకుండా ముగించారు. తాము ఫలానా పని చేయబోతున్నామని కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు. అదే టైమ్ లో మహనాడులో టీడీపీ ఆమోదించిన రాజకీయ తీర్మానం అందరినీ ఆశ్చర్యపరచింది.

ఈ తీర్మానంలో పొత్తుల ప్రస్థావన కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ అలా ఏమీ జరగలేదు. దాంతో నిరాశపడడం జనసేన వర్గాల వంతు అయింది అన్న మాట కూడా వినిపిస్తోంది. నిజానికి టీడీపీ నుంచి పొత్తుల ప్రస్థావన వస్తే ఆ మీదట చేయాల్సింది చేసుకుని పోవచ్చు అన్నది జనసేన ఆలోచన. దానికి ముందు కూడా వన్ సైడ్ లవ్ అంటూ చంద్రబాబు కుప్పం మీటింగులో చెప్పారు. ఇక గోదావరి జిల్లాలా టూర్లో అందరినీ కలుపుకుని పోతామని అన్నారు.

కానీ పార్టీకి అతి పెద్ద వేదికగా ఉన్న మహానాడులో మాత్రం పొత్తుల మీద ఒక్క మాట మాట్లాడితే ఒట్టు అన్నట్లుగా బాబు వైఖరి ఉంది. నిజంగా ఇది ఆశ్చర్యకరమే. ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారికి కూడా టీడీపీ పొత్తుల గురించి పల్లెత్తు మాట అనకపోవడంతో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ కూడా వస్తోంది.

నిజానికి చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటూ చెప్పి పవన్ని ముగ్గులోకి లాగేశారు అన్న మాట అయితే వినిపిస్తోంది. బాబు నుంచి ఈ ప్రతిపాదన రాగానే పవన్ జనసేన ఆవిర్భావ సభలో అన్ని పార్టీలను కలుపుకుని పోతామని అర్ధం వచ్చేలా వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వమని శపధమే చేశారు. ఆ మాటను ఆయన అలా ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అంటే పవన్ బాబు వన్ సైడ్ లవ్ ప్రతిపాదనకు ఇలా సానుకూలంగా స్పందించారు అనుకోవాలి.

ఇపుడు స్పందించాల్సింది టీడీపీ, తీరా పార్టీ సభలో టీడీపీ ఫుల్ సైలెంట్ అయింది. అంటే దాని వెనక ఏముంది అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. అయితే పక్కా వ్యూహం ప్రకారమే టీడీపీ నాయకత్వం ఇలా చేసింది అంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే బాదుడే బాదుడు పేరిట ఏపీలో టీడీపీ చేఇన కార్యక్రమలకు జనాల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో ఒక్కసారిగా టీడీపీలో కొత్త ఆశలు చిగురించాయి అని అంటున్నారు.

అలాగే ఇటీవల వెల్లడైన కొన్ని సర్వేలలో కూడా టీడీపీ ఓట్ షేర్ మూడు శాతం పెరిగింది అని కూడా చెబుతున్నారు. ఇక జనసేన అయినా మరో పార్టీ అయినా పొత్తుల పేరిట డిమాండ్ చేసే పరిస్థితి లేకుండానే టీడీపీ ఇవన్నీ చూసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది  అంటున్నారు. అంటే తమంతట తాము పొత్తుల గురించి మాట్లాడకుండా గమ్మున ఉండడమే టీడీపీ విధానం అన్న మాట. అదే టైమ్ లో సింగిల్ గా వెళ్ళినా కూడా టీడీపీకి ఎడ్జి ఉంటుందని కొన్ని సర్వేలు చెబుతున్న వేళ పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇచ్చుకోవచ్చు కదా అన్న ఆలోచనలు కూడా ఆ పార్టీ చేస్తోంది అంటున్నారు.

ఇక ఏపీలో వైసీపీని ఢీ కొట్టే అతి పెద్ద పార్టీగా టీడీపీయే ఉంది. ఈ విషయంలో  ఎవరికైనా నో  డౌట్. దాంతో పొత్తుల పేరిట పదే పదే ప్రకటనలు చేయడం ద్వారా తాము బలహీనంగా ఉన్నామన్న సంకేతాలు పంపడం తప్పు అవుతుందని కూడా టీడీపీ భావిస్తోంది. మొత్తానికి చాలా రకాలుగా ఆలోచించిన మీదటనే పొత్తు మాట లేకుండా మహానాడుని టీడీపీ ముగించింది. పైగా బంతి పూర్తిగా జనసేన కోర్టులో వేసినట్లు అయింది.

ఇప్పటికే అన్ని పార్టీలను కలుపుతాను అని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ దిశగా తానే ముందుకు రావాల్సి ఉంటుంది. అంటే పొత్తుల విషయంలో తానే మొదటి అడుగు వేసి మొదటి  మాట చెప్పాల్సి ఉంటుందన్న మాట. అలా పవన్ని ముగ్గులోకి లాగి టీడీపీ సైలెంట్ గా ఉండడమే పక్కా వ్యూహం అంటున్నారు. దీని వల్ల సీట్ల విషయంలో  బేరాలాడే స్థితి కూడా తగ్గి టీడీపీ అనుకుంటున్న సీట్లకే జనసేన ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఫార్టీ ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్ అంటే ఇదే కదా.
Tags:    

Similar News