మాకెందుకు ఆ ప‌ద‌వులంటున్న వైసీపీ మంత్రులు!

Update: 2022-03-14 09:24 GMT
ఏపీ రాజ‌కీయాల్లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కేబినేట్ ప్ర‌క్షాళ‌న‌కు ఓ వైపు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతుంటే.. మ‌రోవైపు ఎవ‌రి ప‌ద‌వి ఊడుతుందో అని ప్ర‌స్తుత మంత్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రుల‌పై వేటు త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో ఉన్న 19 మంత్రుల్లో కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే కొన‌సాగిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఆ న‌లుగురు.. బొత్స స‌త్య‌నారాయాణ‌, పెద్ది రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వీళ్లు మిన‌హా మిగ‌తా మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు వేటు ప‌డ్డ మంత్రుల‌కు జిల్లా అధ్య‌క్ష‌, ప్రాంతీయ మండ‌లి అధ్య‌క్ష ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం మ‌రింత విడ్డూరంగా ఉంద‌ని మంత్రులే అనుకుంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌..

గ‌త ఎన్నిక‌ల్లో భారీ విజ‌యంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చినప్పుడే మంత్రుల ప‌ద‌వీ కాలం రెండున్న‌రేళ్లు మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు మూడేళ్లు కావ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై జగ‌న్ దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల కేబినేట్ స‌మావేశంలో జ‌గ‌న్ ఆ మేర‌కు మంత్రుల‌కు స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లిచ్చార‌ని తెలిసింది.

ఈ ఉగాదికి జ‌గ‌న్ ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్ర‌స్తుతం ప‌ద‌వుల్లో ఉన్న మంత్రుల‌కు భ‌యం ప‌ట్టుకుంది. దాదాపు 90 శాతం మందిపై వేటు వేసి కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇక వేటు ప‌డ్డ మంత్రుల‌ను కూల్ చేసేందుకు జిల్లా, ప్రాంతీయ మండ‌ళ్ల అధ్య‌క్ష ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తాన‌ని సీఎం చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని నడిపించే బాధ్య‌త వాళ్ల‌కు ఇస్తాన‌ని అంటున్నారు.

కానీ మంత్రుల అసంతృప్తి..

రాజకీయాల్లో ఎంతో అనుభ‌వం ఉండి ప్ర‌స్తుతం మంత్రులుగా ఉన్న నేత‌లు ఇప్పుడు జిల్లా అధ్య‌క్షుడి ప‌ద‌విని చేప‌డ‌తారా? అన్న‌ది సందేహం మారింది. మ‌రోవైపు మూడు జిల్లాల‌కో ప్రాంతీయ మండ‌లి ఏర్పాటు చేసి సీనియ‌ర్ నేత‌ల‌ను వాటికి అధ్య‌క్షుల‌ను చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కానీ ఈ ప‌వ‌ర్ లేని ప్రాంతీయ మండ‌ళ్ల ప‌ద‌వులు త‌మ‌కెందుకుని ఆ నేత‌లు వాళ్ల‌లో వాళ్లు మ‌ద‌న ప‌డుతున్నార‌ని స‌మాచారం. ఇక ఇప్పుడు మంత్రివ‌ర్గంలో 90 శాతం మంది కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని జ‌గ‌న్ అంటున్నారు.

అంటే కొత్త‌గా ఎంపికైన ఎమ్మెల్యేలు.. ఇప్ప‌టివ‌ర‌కూ మంత్రి ప‌ద‌వి అవకాశం రాని వాళ్ల‌కు ఈ సారి బంపర్ ఆఫ‌ర్ దొరికిన‌ట్లే. అయితే త‌మ‌కంటే జూనియ‌ర్లు, కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు ఇస్తే తాము వాళ్ల‌కు ఫోన్ చేసి వివ‌రాలు చెప్పాలా? అని ఈ సీనియ‌ర్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. జిల్లాలో ఏ విష‌య‌మైనా మంత్రుల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుంద‌ని తెలిసింది.

ఇప్పుడు కొత్త‌గా మంత్రుల‌య్యే జూనియ‌ర్లు త‌మ మీద పెత్తనం చేస్తే ప‌రిస్థితి ఏమిట‌ని? ఈ సీనియ‌ర్ నాయ‌కులు అందోళ‌న చెందుతున్నార‌ని తెలిసింది. ఏదో 20 శాతం కొత్త‌వాళ్ల‌కు ఇస్తే ఫ‌ర్వాలేదు కానీ ఏకంగా 90 శాతం మందిని తీసుకువ‌చ్చి కేబినేట్లో కూర్చోబెట్టాల‌ని జ‌గ‌న్ అనుకోవ‌డం స‌రికాద‌ని ప్ర‌స్తుత మంత్రులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొత్త‌వాళ్ల‌కు ఆ ప‌ద‌వులు ఇస్తే ఇక తాము కోల్డ్ స్టోరేజీకి వెళ్లాల్సిందేన‌ని బాధ ప‌డుతున్నారు.
Tags:    

Similar News