ఇందుకే..విజ‌యసాయిరెడ్డిని మ‌ళ్లీ నంబ‌ర్ 2 చేసిన‌ జ‌గ‌న్‌

Update: 2022-02-28 11:55 GMT
సుదీర్ఘ‌కాలంగా త‌న పార్టీలో ఉన్న అనుమానాల‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెక్ పెట్టారు.

పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజ‌య‌సాయిరెడ్డి పార్టీలో నంబ‌ర్ 2 అవునా కాదా అనే చ‌ర్చ‌కు తెర‌దించుతూ...ఆయ‌న స్థానం ప‌దిలంగానే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇంఛార్జ్ గా విజ‌యసాయిరెడ్డిని నియ‌మిస్తూ వైఎస్ జ‌గ‌న్ ఆదేశాలు వెలువ‌రించారు.

వైసీపీ ముఖ్య‌నేత‌గా గుర్తింపు పొంద‌డ‌మే కాకుండా పార్టీలో నంబ‌ర్‌2 అనే పేరు పొందిన‌ ఎంపీ విజ‌యసాయిరెడ్డికి పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే రీతిలో ప‌రిస్థితులు మారిపోయాయ‌నే ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో కొద్దిరోజుల కింద‌ట జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అన్న‌ట్లుగా కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను సైతం ఆయా వ‌ర్గాలు ప్ర‌చారంలో పెట్టాయి.

అయితే, ఈ విష‌యంలో వైసీపీ వ‌ర్గాల నుంచి అవున‌నే క్లారిటీ రాలేదు. కాదు అని కొట్టిపారేయ‌లేదు. దీంతో విజ‌య‌సాయిరెడ్డి స్థానంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతూనే ఉన్నాయి.

ఇలాంటి స‌మ‌యంలోనే తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ విభాగాల‌కు ఇంచార్జీగా అత్యంత కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు వెలువ‌రించారు.

దీంతో విజ‌యసాయిరెడ్డి పాత్ర ఏంట‌నే దానికి చెక్ పెట్టార‌ని అంటున్నారు. కాగా, ఏపీ రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్ట‌ణం కేంద్రంగా కార్య‌క‌లాపాల‌న్నీ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైన వైఎస్ జ‌గ‌న్ ఈ క్ర‌మంలో పార్టీ ప‌రంగా చురుగ్గా ప‌నిచేస్తున్న విజ‌య‌సాయిరెడ్డికి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News