కోమటి రెడ్డి ని బీజేపీ ప్రీ ఫైనల్ గా వాడుకుంటుందా?

Update: 2022-07-27 10:52 GMT
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఎలాగైనా కొట్టాలని బీజేపీ కంకణం కట్టుకుంది. తెలంగాణ వ్యాప్తంగా బలం లేని బీజేపీతో అది సాధ్యమయ్యే పని కాదు..మరేం చేయాలి? అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. వారిని ఏమార్చి పార్టీలో చేర్చుకొని వారితో బలపడాలని చూస్తోంది.

హుజూరాబాద్ లో ఈటల, దుబ్బాకలో రఘునందన్ రావులు ఒకప్పుడు టీఆర్ఎస్ వాదులే. అందులో పడక బయటకు వచ్చినవారే. కానీ సొంతంగా బీజేపీ నేతలు కాదు. ఇలా పక్కపార్టీ నేతలపై భారం వేసి ఎదగాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. బీజేపీ వలకు ఏ చేపలు పడుతాయా? అని శూలశోధన చేస్తోంది.

తాజాగా కోమటిరెడ్డి బీజేపీ వలకు చిక్కినట్టు తెలుస్తోంది. ఆయనను సాంతం వాడుకొని ఏమార్చి బకరాను చేసి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. కోమటిరెడ్డి బలమైన నేత కావడం.. ఆర్థికంగా అండదండలు ఉండడం.. మునుగోడులో టీఆర్ఎస్ బలం లేకపోవడంతో కోమటిరెడ్డిని గెలిపించుకొని వచ్చే ఎన్నికల వరకూ మరింత మంది నాయకులను ఆకర్షించాలన్నది బీజేపీ ఎత్తుగడ. కానీ అదంత ఈజీ కాదన్నది విశ్లేషకుల మాట...

ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీలకు నేతలు, కార్యకర్తల బలం ఉంది. అదే బీజేపీకి వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే నియోజకవర్గ నేతలున్నారు. ఆ బలహీనతను టీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తివాదులతో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసమే కోమటిరెడ్డి లాంటి వారికి గాలం వేసి లాగుతోంది.

హుజూరాబాద్, దుబ్బాకలో బీజేపీ గెలిచాక.. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందర చాలా మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరి ఆ పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. ఇప్పుడు కోమటిరెడ్డిని చేర్చుకొని.. మునుగోడులో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి గెలవాలని..త ద్వారా ప్రీ ఫైనల్ లాంటి ఈ ఎన్నికల్లో గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందర పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి వలసలను ప్రోత్సహించాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది.

ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు ఏకాకిలా ఉన్న కోమటిరెడ్డిని బీజేపీకి లాగారు. ఈయనతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి ప్రీఫైనల్ లాంటి పరీక్షలో విజయం సాధించాలని  బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈయనతో రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ వేవ్ తెలంగాణలో ఉందని ప్రజలు, నేతలకు అర్థమవుతుంది.

మునుగోడులో బీజేపీ గెలిస్తే కనుక ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ లోనే కీలక నేతలు క్యూ కడుతారని బీజేపీ భావిస్తోంది. ఇలా సొంత బలం లేని బీజేపీ.. కోమటిరెడ్డిని వాడుకొని బలం పుంజుకోవాలని చూస్తోంది.

హుజూరాబాద్ లా చేసినట్టే మునుగోడులోనూ బీజేపీ పకడ్బందీగా వ్యూహాలు రచించి గెలవాలని చూస్తోంది. అయితే హుజూరాబాద్లో ఈటలకు ఫెయిత్ ఉంది. కానీ మునుగోడులో గెలిచిన మూడేళ్లలో కోమటిరెడ్డి పర్యటించిన పాపాన పోలేదు.ఫక్తు తన వ్యాపారాలు చూసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికే మునుగోడులోని మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, సర్పంచ్, ఎంపీటీసీలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. బీజేపీకి అసలు మునుగోడులో నెట్ వర్క్ లేదంటే అతిశయోక్తి కాదు. కోమటిరెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే ఆయనకు స్థానికంగా ఉండే నేతలే లేరు. ఈటల రాజేందర్ లా నియోజకవర్గంలో పేరు, పరపతి లేదు. ధనబలం తప్ప కోమటిరెడ్డికి ఏమీ లేదు. అది ఎన్నికల్లో పనిచేయదని హుజూరాబాద్ లోనే తేలిపోయింది.వ్యక్తిగత ఇమేజ్, జానకర్షణ, కార్యకర్తల బలం.. ప్రజల్లో అభిమానం ఉంటేనే గెలుస్తారు. కానీ కోమటిరెడ్డికి మునుగోడులో అసలు ఇలాంటివేవీ లేవు.

మునుగోడులో కోమటిరెడ్డిని పట్టుకొని ప్రీ ఫైనల్ కు వెళితే బీజేపీ బొక్కబోర్లా పడడం ఖాయమని అంటున్నారు. బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం కోమటిరెడ్డిన బలిపశువును చేయడానికి రెడీ అవుతోంది. అది అర్థం చేసుకోలేక కోమటిరెడ్డి బీజేపీని అతిగా ఊహించుకొని ఆ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు.  ఇదే జరిగితే ఎన్నికల్లో కోమటిరెడ్డి చిత్తవడం ఖాయమంటున్నారు.

జనంలో తిరిగే నేతలకు మునుగోడులో బీజేపీ బలం ఎంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ బలం ఎంతో తెలుసు. నిలకడలేని రాజగోపాల్ లాంటి వారు బీజేపీలోకి వెళ్లినా పెద్దగా తేడా ఏమీ రాదు. పైగా కోమటిరెడ్డి తీరు నచ్చక మునుగోడు ప్రజలే ఓడించినా ఓడించేస్తారు. కోమటిరెడ్డితో ఎన్నికలకు వెళ్లి గెలవాలనుకుంటున్న బీజేపీకి ఇది కూడా మైనస్ గా మారచ్చు.మొత్తంగా ఈ ఎపిసోడ్ లో బీజేపీ ‘ప్రీఫైనల్’ ఆశలు కోమటిరెడ్డితో నెరవేరే సూచనలు లేవని.. ఎన్నికల ముందర కోమటిరెడ్డిని వాడుకొని వలసలు ప్రోత్సహించాలనుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలు కావడం ఖాయమంటున్నారు. వాపును చూసి బలుపు అనుకొని ముందుకెళితే బీజేపీకి, కోమటిరెడ్డికి తగిన గుణపాఠం తప్పదంటున్నారు.
Tags:    

Similar News