సవాలుకు సిద్ధమని స్పందించేందుకు నెల రోజులు టైమిచ్చిన రేవంత్

Update: 2022-03-07 04:10 GMT
ప్రత్యర్థులను మాటలతో ఉచకోత కోయటం ఎలానో గులాబీ పార్టీ నేతలకు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరమే ఉండదు. రాజకీయంగా తమకు తలనొప్పిగా మారిన బీజేపీ.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతూ ఎప్పటికప్పుడు రాజకీయ వేడిని రగిల్చే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్.. ఆయన కుమారుడు కమ్ చిన్న బాస్ కేటీఆర్ ముందుంటారు.

తాజాగా కాంగ్రెస్ పై ఫైర్ అయిన కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? చూపిస్తారా? అని ప్రశ్నించటం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ నోటి నుంచి వచ్చిన సవాలు రాజకీయ వేడిని రగిల్చింది.
తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలో అమలవుతున్నా తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.
దీనిపై తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెఢీ అయ్యారు. సవాలుకు సై అన్నారు.

తెలంగాణతో పోలిస్తే తాము అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ లో మంచి పథకాలు ఉన్నాయని.. రూ.2500 మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి కేటీఆర్ ను తాను తీసుకెళతానని.. మరి ఆయన వస్తారా? అంటూ సవాలుకు ప్రతి సవాలు విసిరారు.

కేటీఆర్ కు తాను 30 రోజులు సమయం ఇస్తున్నానని.. అందుకు స్పందించాలన్నారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేకత ఉందన్నఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్ గా జోస్యం చెప్పారు.

రానున్న డిసెంబరులో కేసీఆర్ ఎన్నికలకు వెళతారని.. అందుకే.. ఇదే చివరి బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. మరి.. రేవంత్ ప్రతిసవాలుకు కేటీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News