టీడీపీ మహానాడు విజయవంతం వెనుక అసలు కారణమిదేనా?

Update: 2022-05-29 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయాక, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడు ప్రాణం పోసిందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుతో దాదాపు అంపశయ్యపైకి చేరుకున్న టీడీపీలో కొత్త జోష్ నెలకొందా? అధికారం మాట అటుంచి.. ఇక టీడీపీ అంతరించిపోతుందనుకున్న టీడీపీ రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుందా? వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇక కదనరంగంలోకి కాలు పెట్టేసినట్టేనా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు.

మే 27, 28 తేదీల్లో మహానాడు పేరిట ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో నిర్వహించిన టీడీపీ మహానాడు ఆ పార్టీ అంచనాలకు మించి విజయవంతమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ కూడా ఈ స్థాయిలో మహానాడు విజయవంతమవుతుందని అంచనా వేయలేదని అంటున్నారు. చివరి రోజు అంటే మే 28న నిర్వహించిన సభకు దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యారని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ ఇంతమంది హాజరుకాలేదని గుర్తు చేస్తున్నారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు పెట్టిన మహానాడులకు కూడా ఈ స్థాయి ఆదరణ లేదని నాటి పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు.

జగన్ ప్రభుత్వం మహానాడుకు వెళ్లనీయకుండా వాహనాలను అడ్డుకోవడం, టైర్లలో గాలి తీసేయడం, మహానాడు జరిగే రోజుల్లోనే ఒంగోలులో రుతుస్రావ దినోత్సవాలు నిర్వహించడం. ఈ ఉత్సవాలకు డ్వాక్రా మహిళలు, జగనన్న అమ్మ ఒడి అందుకుంటున్నవారు తప్పనిసరిగా రావాలనే నిబంధనలు పెట్టడం, పోలీసులతో మహానాడుకు వచ్చేవారిని అడుగడుగునా అడ్డుకోవడం వంటివాటికి పాల్పడ్డా మహానాడుకు వెల్లువలా జనం తరలివచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు.

మహానాడుకు జనం పోటెత్తడం .. ఓ రకంగా తెలుగుదేశం పార్టీ మీద అనుకూలత కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతకు నిదర్శమని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం మీద రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తికి, వ్యతిరేకతకు... మహానాడు విజయానికి లింక్ పెట్టి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతుండటం గమనార్హం.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలను వేధించడం, వారిని బూతులతో తిట్టించడం, ఇళ్లలోని మహిళలను, చిన్న పిల్లలను సైతం వదిలిపెట్టకుండా వారిపైన అసభ్య, అభ్యంతకర వ్యాఖ్యలు చేయించడం, ఇప్పటివరకు రాజధానిని అతీగతీ లేకుండా చేయడం, రాష్ట్రానికి జీవ నాడి లాంటి పోలవరం ఇప్పటికీ పూర్తి కాకపోవడం, ప్రత్యేక హోదా ఊసే లేకపోవడం, ఒక్క పేరున్న కంపెనీ రాష్ట్రంలో ప్లాంట్ లేదా తమ యూనిట్ పెట్టకపోవడం, అస్సలు యూనిట్ సంగతి దేవుడెరుగు పెట్టుబడులు కూడా రాకపోవడం, ఎన్నో దశాబ్దాల క్రితం ఇళ్లు కట్టుకున్నవారి నుంచి వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో పది వేల రూపాయల చొప్పున డబ్బులు బాదడం, చెత్త పన్ను వసూళ్లు, పెరిగిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలతో పేదల నడ్డి విరవడం, ఇసుక, మద్యం దోపిడీతో లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడం, ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్న న్యాయమూర్తులను కూడా వదలకుండా వారిపైనా ఒంటి కాలి మీద లేవడం.... ఇలా జగన్ మూడేళ్ల ప్రభుత్వం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందని నిపుణులు చెబుతున్నారు.

జగన్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని.. రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాలా అంచుకు చేర్చిందని ఆయా రంగాల నిపుణులు వివరిస్తున్నారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి కొందరి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నా.. ఆ పథకాలు అందనివారు సంఖ్య కూడా అంతే ఎక్కువ సంఖ్యలో ఉందని గుర్తు చేస్తున్నారు. మంత్రి పదవులు అంటూ కొంత మందికి ఇచ్చినా బీసీల్లో ఉన్న ఒకటి రెండు ప్రధాన కులాలకే ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు.. ముఖ్యంగా రోడ్లు ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉన్నాయని పేర్కొంటున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు నారా లోకేష్ ల వ్యక్తిత్వాన్ని హననం చేయించడం, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించడం, దానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 13 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రజలను కలచివేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలి గానీ.. ఇంట్లో భార్యలు, పసి పిల్లలైన కుమార్తెలపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయించడాన్ని ప్రజలు హర్షించలేకపోయారని అంటున్నారు. చంద్రబాబుకు తామున్నామని మద్దతు ఇవ్వడానికే ప్రజలు మహానాడుకు క్యూ కట్టారని వివరిస్తున్నారు.

ఇలా అన్ని రూపాల్లో జగన్ ప్రభుత్వంపై గూడు కట్టుకున్న వ్యతిరేకతతో రాష్ట్ర ప్రజలంతా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడి వైపు చూశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మహానాడుకు టీడీపీ ఆశించినదానికంటే, ఆ పార్టీ ఏర్పాటు చేసినదాని కంటే ప్రజలు అధికంగా తరలివచ్చారని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థ, అరాచక పాలనకు ఇక చరమగీతం పాడాలనే భావన ప్రజల్లో వచ్చిందని అంటున్నారు. అందుకే తమను, రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడిని చంద్రబాబులో ప్రజలు చూసుకుంటున్నారని, జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వివరిస్తున్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుని ముందుకు నడవాలని ప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మహానాడుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చి విజయవంతం చేశారని చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మహానాడు విజయం చాటిచెప్పిందని అంటున్నారు. ఇదే జోష్ తో టీడీపీ వచ్చే రెండేళ్లు ముందుకు నడవాలని సూచిస్తున్నారు. ఈ రెండేళ్లు ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని.. ప్రజా ఉద్యమాలను నిర్మించాలని.. అన్నిటికంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలసి ఆయన మద్దతుతో అడుగులు వేయాలని టీడీపీకి సూచిస్తున్నారు.

జనసేన -తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర ప్రజలు కోరుకునే అభివృద్ధిని, సంతులన సామాజిక న్యాయాన్ని, సుస్థిరాభివృద్ధిని, నిజమైన ఆర్థికాభివృద్ధిని అందించగలదని ప్రజలు నమ్ముతున్నారని రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు నడుచుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు టీడీపీ మహానాడు అంచనాలకు మించి విజయం సాధించడంతో అధికార వైఎస్సార్సీపీలో గుబులు మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు సక్రమంగా జరగకుండా, విజయవంతం కాకుండా ఉండటానికి అన్ని రకాల ఆటంకాలు కల్పించినా మహానాడు సక్సెస్ కావడంతో తీవ్ర అంతర్మథనం చెందుతోంది. ఎందుకు ఇలా జరిగిందా అని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్విట్లర్లాండ్ హాలిడే నుంచి తిరిగొచ్చాక ఈ విషయంపై తమను ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. తమ ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో వైఎస్సార్సీపీ నేతలకు మహానాడు సక్సెస్ ద్వారా తెలిసివచ్చినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాము లెక్కకు మిక్కిలిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీడీపీ మహానాడుకు అన్ని లక్షల మంది జనం ఎందుకు హాజరయ్యారో తెలియక ఆ పార్టీ నేతలు బిత్తరచూపులు చూస్తున్నారని పేర్కొంటున్నారు.

కాగా, టీడీపీ మహానాడుకు దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజలు హాజరయ్యారని ఇంటెలిజెన్సు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. అలాగే కొన్ని లక్షల మంది ప్రజలు ఫేస్ బుక్ లైవ్, యూట్యూబ్ చానెళ్లు, వివిధ వార్తా చానెళ్ల ద్వారా మహానాడును వీక్షించారని స్వయంగా ఇంటెలిజెన్సే నివేదించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూశారని చెబుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారా? పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తారా? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారు? జగన్ ప్రభుత్వంపై ఎలా విరుచుకుపడతారు? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News