వంటింటి మంటకు చెక్ పెట్టేలా జగన్ యాక్షన్ ప్లాన్.. మన సంగతేంది కేసీఆర్?

Update: 2022-03-21 04:30 GMT
ఎక్కడో ఏదో ఒక మూల ఏం జరిగినా.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో వ్యాపారులు ముందుంటారు. అలా అని  ఆ వ్యాపారులు.. మన ఇంటి చుట్టుపక్కల ఉండే చిన్నాచితకా వ్యాపారులు కాదు. ఆ మాటకు వస్తే.. ఈ మొత్తం ఆటలో వారి పాత్ర చాలా చాలా చిన్నది. చూసేందుకు నేరమంతా వారే చేసినట్లు  కనిపించినా.. అసలు నిందితులు మాత్రం బడా వ్యాపారులే.

అక్కడెక్కడో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెడితే.. దాని ప్రభావం ఇప్పుడు మన మీదా.. మన వంటింటి మీదా పడిన పరిస్థితి. ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకోవటం ఎక్కువ. కానీ.. ఇప్పుడు అన్ని వంట నూనెల మీదా దాని ప్రభావం పడింది.

రష్యా యుద్ధం మొదలు పెట్టటానికి ముందు వరకు లీటరు సన్ ఫ్లవర్ అయిల్ రూ.120-130 మధ్యన ఉంటే.. అదిప్పుడు ఏకంగా రూ.200 వరకు వెళ్లిపోయింది. హోటల్.. చిరు వ్యాపారులు వినియోగించే పామాయిల్ ధరకు రెక్కలు వచ్చేశాయి.

దేశీయంగా ఉత్పత్తి అయ్యే వేరు సెనగనూనెకు సైతం ధరాఘాతం తప్పలేదు. అంతకంతకూ పెరిగిపోతున్న నూనెలకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీలోని జగన్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న వంట నూనె ధరలకు చెక్ పెట్టేందుకు.ద. అధికారులతో ప్రత్యేకంగా తనిఖీలు చేయటంతో పాటు.. షాపులపై దాడులు చేస్తోంది.

నిబంధనలకు విరుద్ధంగా దాచిన నూనె స్టాకుల్ని బయటపెట్టేందుకు వీలుగా అధికారులుు ఇప్పటికే పలువురి మీద దాడులు చేపట్టారు. మార్కెట్లో ధరలు పెరిగిపోవటానికి కారణమైన బడా వ్యాపారులతో పాటు.. ఇతరుల మీదా కేసులు బుక్ చేస్తున్నారు అధికారులు. పెరిగిపోయిన వంట నూనెల ధరలకు కళ్లాలు వేయటానికి.. ప్రజల మీద ఆ భారం పడకుండా ఉండేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా.. మొబైల్ షాపుల ద్వారా వంట నూనె పాకెట్లను అమ్మాలన్న ప్రణాళికను సిద్ధం చేసింది.

రష్యా యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగిపోయిన వంట నూనెల ధరల్నిఅదుపులోకి తెచ్చేందుకు ఏపీలోని జగన్ ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చర్యలు తూతూ మంత్రంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ధరల మంటపై జగన్ సర్కారు యాక్షన్ ప్లాన్ షురూ చేసిన నేపథ్యంలో.. కేసీఆర్ సర్కారు సైతం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News