రేవంత్ దూకుడు.. జ‌గ్గారెడ్డిపై బ్ర‌హ్మాస్త్రం..!

Update: 2022-03-05 23:30 GMT
కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డిపై రేవంత్ బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించ‌నున్నారా..? నిత్యం త‌న అస‌మ్మ‌తి తెలుపుతూ పార్టీ శ్రేణుల ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లుతున్న ఆయ‌న‌పై రేవంత్ స‌రికొత్త ప్ర‌యోగం చేయ‌నున్నారా..? సంగారెడ్డి నుంచి జ‌గ్గారెడ్డిని త‌ప్పించే యోచ‌న‌లో ఉన్నారా..? అంటే పార్టీ ముఖ్యులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

రేవంత్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచీ నిత్యం త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు జ‌గ్గారెడ్డి. ఏదో ఒక రూపంలో త‌న నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ పార్టీ శ్రేణుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నారు. రేవంత్ ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని.. సీనియ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాహాటంగానే విమ‌ర్శిస్తున్నారు. అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి రేవంతును త‌ప్పించి సీనియ‌ర్ల‌లో ఒక‌రికి ఇవ్వాల‌ని అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేశారు.

అప్ప‌టి నుంచి పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిన‌ట్లు అయింది. పార్టీలోని యువ‌త‌రం, కొంద‌రు సీనియ‌ర్లు రేవంతుకు అండ‌గా నిల‌బ‌డ‌గా.. జ‌గ్గారెడ్డికి వీహెచ్‌, ఉత్త‌మ్‌, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ త‌దిత‌ర నేత‌లు మ‌ద్ద‌తు తెలిపారు. ఒక‌ద‌శ‌లో రాజీనామాకు కూడా సిద్ధ‌ప‌డ్డారు జ‌గ్గారెడ్డి. పార్టీ వీడొద్ద‌ని సీనియ‌ర్లు న‌చ్చ‌జెప్పినా ఆయ‌న మెత్త‌బ‌డ‌లేదు. కేవ‌లం యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల కోస‌మే ఆయ‌న ఎదురుచూస్తున్నారు. ఫ‌లితాల త‌ర్వాత పార్టీ పెద్ద‌లు త‌న‌కు అపాయింట్మెంట్ ఇస్తే ఉంటాను లేదంటే త‌న దారి తాను చూసుకుంటాన‌ని బెదిరిస్తున్నారు.

అయితే.. ఈ ప‌రిణామాల‌తో సంబంధం లేకుండానే రేవంత్ ఆయ‌న‌పై స‌రికొత్త ఎత్తుగ‌డ వేస్తున్నార‌ట‌. ఆయ‌న రాజీనామా చేయ‌కుండా పార్టీలోనే ఉన్నా కూడా సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌ప్పించే ఆలోచ‌నలో ఉన్నార‌ట‌. అలాగ‌ని ఆయ‌న‌ను పార్టీకి దూరం పెట్ట‌కుండా.. సంగారెడ్డి నుంచి ఆయ‌న స‌తీమ‌ణి మెద‌క్ జిల్లా అధ్య‌క్షురాలు నిర్మ‌ల‌ను పోటీ చేయించాల‌నే భావ‌న‌లో రేవంత్ ఉన్నార‌ట‌. జ‌గ్గారెడ్డిని మెద‌క్ పార్ల‌మెంటు బ‌రిలో నిల‌పాల‌ని యోచిస్తున్నార‌ట‌.

దీని ద్వారా ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మాదిరిగా త‌న‌కు అడుగ‌డుగునా అడ్డుప‌డుతున్న జ‌గ్గారెడ్డిని సైడ్ చేయొచ్చ‌ని.. మ‌హిళా కోటాలో ఆయ‌న స‌తీమ‌ణికి పార్టీ టికెట్ ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని రేవంత్ ఎత్తుగ‌డ‌గా ఉంది. ఆ త‌ర్వాత మెద‌క్ లోక్ స‌భ నుంచి జ‌గ్గారెడ్డిని పోటీ చేయిస్తే ఆ ప్ర‌భావం ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా ఉంటుంద‌ని.. కాంగ్రెస్ పార్టీకి ఇది లాభించే అంశ‌మ‌ని రేవంత్ యోచిస్తున్నారు.

రేవంత్ ప్ర‌తిపాద‌న ఎంత వ‌ర‌కు అమ‌ల‌వుతుంది.. సంగారెడ్డి నుంచి మూడుసార్లు (కాంగ్రెస్ నుంచి రెండుసార్లు, టీఆర్ఎస్ నుంచి ఒక‌సారి) గెలిచిన జ‌గ్గారెడ్డి అందుకు ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News